Donald Trump: పోర్న్ స్టార్ కు డబ్బిచ్చిన కేసులో ట్రంప్ దోషే; కానీ జైలు శిక్ష లేదు, జరిమానా లేదు!
Donald Trump: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హుష్ మనీ కేసులో దోషిగా తేలారు. డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా తేల్చిన మన్ హటన్ కోర్టు న్యాయమూర్తి అతడికి ఎలాంటి జైలు శిక్ష కానీ, జరిమానా కానీ విధించలేదు. కానీ, ట్రంప్ రికార్డులో మాత్రం ఈ నేరం నిర్ధారణ అయినట్లుగా ఉంటుంది.
Donald Trump: లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు పోర్న్ స్టార్ కు డబ్బులు చెల్లించిన కేసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా నిర్ధారించింది. అయితే, ఈ నేరానికి గానూ అతడు జైలుకు వెళ్ళాల్సిన అవసరం కానీ, జరిమానా చెల్లించాల్సిన అవసరం కానీ లేదు. అతని రికార్డులో మాత్రం అపరాధం చేసినట్లుగా ఉంటుంది.
నాలుగేళ్లు జైలు శిక్ష పడాలి కానీ..
డొనాల్డ్ ట్రంప్ పై నిరూపితమైన నేరానికి గానూ అతడికి గరిష్టంగా 4 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ట్రంప్ ను ఈ కేసులో దోషిగా తేల్చిన మన్ హటన్ జడ్జి జువాన్ ఎం మెర్చన్.. ట్రంప్ నకు ఎలాంటి శిక్ష విధించకూడదని తీర్పునిచ్చారు. తద్వారా, తదుపరి అమెరికా (usa news telugu) అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంలో ట్రంప్ కు ఎలాంటి చట్టపరమైన ఇబ్బంది కలగకుండా, దేశంలో ఎలాంటి రాజ్యాంగ సమస్య ఎదురు కాకుండా న్యాయమూర్తి జాగ్రత్త పడ్డారు.
ట్రంప్ రికార్డు..
ఈ తీర్పుతో నేరం రుజువైన తొలి అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు. శిక్ష విధించే ముందు ఏవైనా తీవ్రమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదేమైనా, అధ్యక్షుడిగా ట్రంప్ అనుభవించే చట్టపరమైన రక్షణ "అన్నింటిని అధిగమించే అంశం" అని ఆయన అన్నారు. జ్యూరీ తీర్పును చెరిపేసే అధికారం అధ్యక్షుడికి న్యాయపరమైన రక్షణలకు లేదని న్యాయమూర్తి అన్నారు. అయితే, ట్రంప్ రికార్డులో ఈ నేరం ఉంటుందన్నారు.
ఇంతకీ ఈ హుష్ మనీ కేసు ఏంటి?
లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు పోర్న్ నటి స్టార్మీ డేనియల్స్ కు 1,30,000 డాలర్లు చెల్లించిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ట్రంప్ తన వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయి. తనతో లైంగిక సంబంధం గురించి బహిర్గతం చేయకుండా ఉండడానికి 2016 అధ్యక్ష ఎన్నికల ముందు పోర్న్ నటి స్టార్మీ డేనియల్స్ కు ట్రంప్ ఈ డబ్బులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ.
నేను ఇన్నోసెంట్..
అయితే, ఈ ఆరోపణలను మొదట్నుంచీ ట్రంప్ ఖండిస్తున్నారు. తీర్పు వెలువరించే ఈ రోజు కూడా విచారణకు తన న్యాయవాదులతో కలిసి వర్చువల్ గా ట్రంప్ హాజరయ్యారు. తాను నిర్దోషినని, ఒకవేళ తనను దోషిగా తేల్చి శిక్ష విధిస్తే పై కోర్టులో అప్పీల్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ (donald trump) చెప్పారు.