Chandrababu Naidu : 'సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన సమయం వచ్చింది'
Chandrababu Naidu : హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 22వ ఎడిషన్‌లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సోషల్ మీడియా నియంత్రణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో సోషల్ మీడియా పరిస్థితి చాలా దుర్భలంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నాయుడు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాని నియంత్రించేందుకు చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ (హెచ్‌టీఎల్‌ఎస్) 22వ ఎడిషన్‌లో ఆదివారం పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు సోషల్ మీడియాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా పాత్ర దుర్భలంగా మారింది. మహిళలు- గౌరవనీయులైన రాజకీయ నేతలను అగౌరవ పరిచేందుకు కొందరు క్రిమినల్స్ సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాలు. అందుకే, సోషల్ మీడియాని నియంత్రించడంతో పాటు ఆ నియంత్రించే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? అన్న దానిపై చర్చ జరగాలి,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
మరోవైపు ఐటీ రంగాన్ని 1995లో తాను ప్రారంభించినట్టు పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ సీఎం.
“ఆ సమయంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉండేవారు. బ్యాండ్‌విడ్త్ కూడా లేని కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు నేను ఆయనతో గొడవపడ్డాను. నా రిపోర్ట్ ఆధారంగానే టెలికాం సెక్టార్‌ని డీ-రెగ్యులేట్ చేశారు,” అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
టెక్నాలజీ విషయంలో భారతీయులు ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు బాగా సంపాదిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా తెలుగు వారు ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
సంకీర్ణ ప్రభుత్వంపై మాటలు..
ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే విధానాలపై చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
“కుటుంబంలో విభేదాలు సాధారణం. కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చాలా ముఖ్యం. సంకీర్ణ ప్రభుత్వంలోనూ ఇంతే. విభేదాలను పక్కనపెట్టి ఒక మాటపై నిలబడాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఇదే చేస్తోంది,” అని ఏపీ సీఎం అన్నారు.
2024 ఏపీ ఎన్నికలు వన్-సైడెడ్ వ్యవహారమని ముందే అంచనా వేసినట్టు సీఎం తెలిపారు. వాస్తవ ఫలితాల కన్నా సర్వేలు చాలా భిన్నంగా ఉంటాయని అన్నారు.
జైలు జీవితం గురించి..
2023లో గడిపిన జైలు జీవితాన్ని ఈ సందర్భంగా మరోమారు గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.
“నోటీసులు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్లినా సరే, పోరాటం ఆపకూడదని, ఎనర్జీ పడిపోకూడదని నిర్ణయం తీసుకున్నాను,” అని ఏపీ సీఎం అన్నారు.
సొంత పేరు చెప్పుకుని ప్రచారాలు చేసిన ప్రతిసారి ఎన్నికల్లో ఓడిపోయినట్టు తెలిపిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నట్టు, వారి భవిష్యత్తును మెరుగుపరిచేందుకు పని చేస్తున్నట్టు వెల్లడించారు.
సంబంధిత కథనం