Captain Vijayakanth: జయలలిత, కరుణానిధిలకు గట్టి పోటీని ఇచ్చిన నాయకుడు; ఇంతకీ కెప్టెన్ ఎలా చనిపోయారు?.. కోవిడ్ తోనా?
Captain Vijayakanth death: ‘కెప్టెన్’ అని అభిమానులు ప్రేమగా పిల్చుకునే ప్రముఖ నటుడు, డీఎండీకే వ్యవస్థాపక నాయకుడు విజయకాంత్ గురువారం మరణించారు. న్యూమోనియాకు చికిత్స పొందుతూ 71 ఏళ్ల వయస్సులో చనిపోయారు.
Captain Vijayakanth death: దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) వ్యవస్థాపక నాయకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ (71) గురువారం కన్నుమూశారు. ఆయనను కాపాడడానికి వైద్య సిబ్బంది చేసిన కృషి వృథా అయింది.
కొరోనాతోనా?
అయితే, విజయ్ కాంత్ కు కొరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని ఆయన పార్టీ డీఎండీకే బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని విజయకాంత్ (Vijayakanth) చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు నిర్ధారించలేదు. కొరోనా నిర్ధారణకు సంబంధించి రెండో సారి స్యాంపిల్ టెస్ట్ ఫలితాలు రాకముందే, పార్టీ ఆ ప్రకటన విడుదల చేసిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాంతో, విజయ్ కాంత్ కోవిడ్ 19 తోనే మరణించారా? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.
2005 నుంచి..
తమిళ రాజకీయాల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకేకు, కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే కు విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే గట్టి పోటీని ఇచ్చింది. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ ద్రవిడ పార్టీగా నిలిచింది. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) ను విజయ్ కాంత్ 2005లో స్థాపించారు. ఆ పార్టీతో దాదాపు 2 దశాబ్దాల సినీ కెరీర్ ను పక్కనపెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే గెలవబోతోందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే, ఆ ఎన్నికల్లో మెజారిటీ సాధించి, అధికారంలోకి రాలేదు కానీ, చాలా స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీని మాత్రం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 8.38 శాతం ఓట్లు, తరువాతి లోక్ సభ ఎన్నికలలో 10.3 శాతం ఓట్లు సాధించారు.
జయలలిత పార్టీతో పొత్తు..
ఆ తర్వాత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని డీఎంకే పరాజయానికి కారణమయ్యారు. కానీ కొన్నాళ్లకే, తమిళనాడు అసెంబ్లీలో వివిధ అంశాలను లేవనెత్తిన మిత్రపక్షం డీఎండీకే ఎమ్మెల్యేలను జయలలిత దూషించడంతో జయలలిత, విజయకాంత్ ల మధ్య విభేదాలు పెరిగాయి. అసెంబ్లీలో జయలలితతో విజయ్ కాంత్ మాటల యుద్దం రాష్ట్రాన్ని కుదిపేసింది.తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో అర్ధశతాబ్దానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.