Housing prices rise: ఇళ్ల ధరల పెరుగుదల హైదరాబాద్‌లోనే అత్యధికం: ఎన్‌హెచ్‌బీ
Housing prices rise: అహ్మదాబాద్ తరువాత ఇళ్ల ధరల పెరుగుదల హైదరాబాద్‌లోనే అత్యధికమని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ డేటా స్పష్టం చేస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 12: 2021-22 ఆర్థిక సంవత్సరంలో 41 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని, 5 నగరాల్లో రేట్లు తగ్గాయని, 4 నగరాల్లో మార్పు లేదని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ ఆవిష్కరించిన రెసిడెక్స్ సూచీ వెల్లడించింది.
8 మెట్రో నగరాలలో ఇళ్ల ధరల పెరుగుదల ఇలా ఉంది. అహ్మదాబాద్‌లో 13.8 శాతం, హైదరాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 7.7 శాతం, బెంగళూరులో 2.5 శాతం, ఢిల్లీలో 3.2 శాతం, కోల్‌కతాలో 2.6 శాతం, ముంబైలో 1.9 శాతం, పూణేలో 0.9 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ సూచీ రెసిడెక్స్ నివేదించింది.
అత్యధికంగా అహ్మదాబాద్‌లో 13.8 శాతం పెరగగా, నవీ ముంబైలో 5.9 శాతం పతనమయ్యాయని, ఇళ్ల ధరల మార్పు రేంజ్‌ను విశ్లేషించింది.
జూన్ 2021 నుంచి ప్రతి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని, కోవిడ్ అనంతరం హౌజింగ్ మార్కెట్ పుంజుకుంటోందనడానికి ఇది సంకేతమని సూచీ స్పష్టం చేస్తోంది.
క్వార్టర్ వారీగా ఇళ్ల ధరల ట్రెండ్‌ను తెలియపరుస్తూ ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్ సూచీని 2007 నుంచి వెల్లడిస్తోంది. తదుపరి 2017-18ని బేస్ ఇయర్‌గా నిర్దేశించింది.
అండర్ కన్‌స్ట్రక్షన్ ఇళ్లకు కూడా ధరలు 4.8 శాతం మేర పెరిగాయని, అండర్ కన్‌స్ట్రక్షన్, రెడీ టూ మూవ్ ప్రాజెక్టుల ధరలను పరిగణనలోకి తీసుకుని వీటి ధరలను మదింపు చేసినట్టు వెల్లడించింది.
సంబంధిత కథనం