Himachal Pradesh rains : వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం.. దిల్లీ, పంజాబ్‌లో భయం భయం!
Himachal Pradesh rains : భారీ వర్షాలతో ఉత్తర భారతం విలవిలలాడిపోతోంది. ముఖ్యంగాా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. దిల్లీ, పంజాబ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.
Himachal Pradesh rains : ఉత్తర భారతంపై వరుణుడు పగబట్టినట్టు ఉంది పరిస్థితి! దాదాపు అన్ని రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ చేస్తున్న హెచ్చరికలతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటివరకు వేరువేరు ఘటనల్లో సుమారు 20మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం..
హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అనేక జిల్లాల్లో రెండు- మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అనేక రోడ్లు జలమయమయ్యాయి. పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. కాగా.. వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా వరదల ఉద్ధృతికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రాష్ట్రంలో నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా అనేక వంతెనలు ఇప్పటికే కూలిపోయాయి. మండీలోని పంచ్వక్త్ర వంతెన పూర్తిగా ధ్వంసమైపోయింది. బంజార్, పండోహ్ వంటి ప్రాంతాలను కనెక్ట్ చేసే అనేక బ్రిడ్జ్‌లు కూడా కొట్టుకూపోయాయి. ఫలితంగా అనేక ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.
సోమవారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
ఇదీ చూడండి:- Heavy rains in India : భారీ వర్షాలకు ఉత్తర భారతం విలవిల.. అక్కడ 40ఏళ్ల రికార్డు బ్రేక్!
ఇతర ప్రాంతాల్లో..
దిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్లలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ, భయపెడుతున్నాయి. రోడ్ల మీద వరద నీరు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా కార్లు, 2 వీలర్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
భారీ వర్షాల కారణంగా దిల్లీ, గురుగ్రామ్, పంజాబ్‌లలో విద్యాసంస్థలను సోమవారం మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఉద్యోగాలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని పలు సంస్థలు సూచనలు చేసింది.
హత్నికుండ్ బ్యారేజ్ నుంచి దాదాపు లక్ష క్యూసెక్ల నీరును యమునా నదిలోకి విడుదల చేసింది హరియాణా. అప్రమత్తమైన దిల్లీ.. 16 కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేసి వరద ముప్పు ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తోంది. తాజా పరిణామాలపై దిల్లీ సీఎం ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జమ్ముకశ్మీర్‌లోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. కథువా, సంబా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
సంబంధిత కథనం