‘నెలకు 10 రూపాయల విరాళంతో 2 లక్షల మంది నిరుపేద పిల్లలను బడికి పంపుదాం’-hero in you campaign bridging the educational gap for children in need ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hero In You Campaign Bridging The Educational Gap For Children In Need

‘నెలకు 10 రూపాయల విరాళంతో 2 లక్షల మంది నిరుపేద పిల్లలను బడికి పంపుదాం’

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 11:44 AM IST

నెలకు కేవలం10రూపాయల చిరు విరాళంతో నిరుపేద పిల్లల జీవితాలను మార్చవచ్చునని,వారిని బడిబాటలో నడుపవచ్చునని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యు(CRY)పేర్కొంది. ఈమేరకు హీరో ఇన్ యూ అనే క్యాంపేయిన్ ప్రారంభించింది.

హీరో ఇన్ యూ క్యాంపేయిన్ ప్రారంభించిన క్రై సంస్థ
హీరో ఇన్ యూ క్యాంపేయిన్ ప్రారంభించిన క్రై సంస్థ

దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది పిల్లలను తిరిగి బడికి పంపించటం లక్ష్యంగా ‘హీరో ఇన్ యు’ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు CRY ప్రకటించింది. ఈ క్యాంపెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి, ఎవరైనా https://www.cry.org/164/ లింక్ మీద క్లిక్ చేసి, ఏదైనా UPI చెల్లింపు అప్లికేషన్ ద్వారా నెలకు 10 రూపాయలు విరాళంగా ఇచ్చే ప్లాన్‌కు సైనప్ చేయవచ్చునని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

"ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం. ‘హీరో ఇన్ యు’ క్యాంపెయిన్‌కు మద్దతివ్వాలని కోరుతున్నాం. చినుకు చినుకు కలిసి మహాసాగరమయినట్లుగానే.. చిరు చిరు శ్రమలను జోడిస్తే గణనీయమైన మార్పు వస్తుందనే సూత్రం ఆధారంగా ఈ క్యాంపెయిన్‌ను రూపొందించాం” అని CRY రిసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ యామిని కపూర్ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటుకు సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ.. 2022-23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 12.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల స్థాయిల్లో బడికి దూరంగా ఉన్నారని యామిని పేర్కొన్నారు.

‘‘పిల్లల విద్య ప్రాథమిక హక్కుగా ఉన్న మన సమాజంలో, చదువులో ఉన్న అంతరాన్ని తగ్గించటం, నాణ్యమైన విద్యావకాశాలు అందేలా చూడటం, తద్వారా చిన్నారులను సాధికారం చేయటం CRY ప్రారంభించిన ‘హీరో ఇన్ యు’ క్యాంపెయిన్ లక్ష్యం. మన బాల్యంలో ముంత (పిగ్గీ బ్యాంక్)లో పైసా పైసా కూడబెట్టిన తరహాలో చిన్న చిన్న విరాళాలు కలుపుకుని సమకూరే నిధులు మన పిల్లల భవిష్యత్తుకు బ్యాంకుగా నిలుస్తాయి. నెలకు కేవలం 10 రూపాయలతో చిన్నారుల జీవితాలను మనం సమిష్టిగా తిరిగి రాయవచ్చు. వారు చదువుకునేలా, జీవితంలో ఎదిగేలా, సుసంపన్నమయ్యేలా తీర్చిదిద్దవచ్చు’’ అని ఆమె చెప్పారు.

"ఆర్థిక అడ్డంకుల వల్ల కానీ సామాజిక అవరోధాల వల్ల కానీ ఏ ఒక్క చిన్నారీ వెనుకబడకూడదనేది CRY నమ్మకం. ‘హీరో ఇన్ యు’లో భాగస్వాములయ్యేలా సమాజం, కుటుంబం, వ్యక్తులను కదిలించటం ద్వారా ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా సానుకూల మార్పును సృష్టిస్తుందని CRY విశ్వసిస్తోంది. ప్రతి ఒక్క చిన్నారి విద్యా హక్కును కాపాడాలన్న మా నిబద్ధతను ఈ క్యాంపెయిన్ ప్రతిబింబిస్తోంది’’ అని యామిని తెలిపారు.

"హీరో ఇన్ యు క్యాంపెయిన్ ఫిబ్రవరి 2024 వరకు కొనసాగుతుంది. సామాన్య జనంలోని హీరోల మద్దతు కూడగడుతూ 10 లక్షల మంది మద్దతుదారులను సమీకరించడం ద్వారా ఈ సంవత్సరం అదనంగా 2 లక్షల మంది పిల్లలు తిరిగి బడికి వెళ్లి వారి విద్యను కొనసాగించేలా చూడటం ఈ క్యాంపెయిన్ లక్ష్యం’’ అని ఆమె వివరించారు.

మరింత సమ్మిళితంగా ఉండే, మరింత సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించే దిశగా ఈ క్యాంపెయిన్ ఒక ముఖ్యమైన అడుగు అని యామిని అభివర్ణించారు. "ఇది భారతదేశ చిన్నారుల కోసం ప్రతి ఒక్కరినీ ఏకం చేసే ప్రయత్నం. దీనికి ఒక చిన్న పని చేస్తే చాలు: ప్రతి నెలా కేవలం 10 రూపాయలు విరాళంగా ఇవ్వడం. ఆసక్తిగల వారు CRY అధికారిక వెబ్‌సైట్ (www.cry.org) ను సందర్శించి ‘నెలకు 10 రూపాయల విరాళం ప్లాన్’లో సైనప్ చేయవచ్చు. అయితే, నెలకు పది రూపాయలు విరాళం అనేది కనీస మొత్తం. ఎవరైనా సరే 10 రూపాయలకు మించి అధిక మొత్తాన్ని నెల వారీ విరాళంగా ఇచ్చే ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు’’ అని ఆమె చెప్పారు.

"ఈ సామూహిక విరాళాలు కలిసి గణనీయమైన నిధిని ఏర్పరుస్తాయి. ఈ నిధి బడికి దూరంగా ఉన్న లక్షలాది మంది చిన్నారులను విద్యావంతులను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ చిరు విరాళాల సామూహిక శక్తి ఈ చిన్నారుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకువచ్చేలా ప్రభావం చూపుతుంది” అని యామిని అన్నారు.

"ప్రతి చిన్నారి విద్యా హక్కునూ నిలబెట్టేందుకు ఈ ఉదాత్త ప్రయత్నంలో చేతులు కలపాలని అన్ని వర్గాల వారినీ CRY కోరుతోంది. దాతలు అందించే విరాళాల ప్రభావం గురించి వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. వారిచ్చే మద్దతు అణగారిన వర్గాల పిల్లల జీవితాలలో తీసుకువచ్చే సానుకూల మార్పును వారు ప్రత్యక్షంగా చూడవచ్చు’’ అని ఆమె వివరించారు.

WhatsApp channel

టాపిక్