Sunita Williams : అంతరిక్షంలో ‘ఓవర్​టైమ్​’- సునితా విలియమ్స్​కి ఇచ్చే పరిహారం ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!-heres how much sunita williams may get paid for 9 month overtime in space ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunita Williams : అంతరిక్షంలో ‘ఓవర్​టైమ్​’- సునితా విలియమ్స్​కి ఇచ్చే పరిహారం ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!

Sunita Williams : అంతరిక్షంలో ‘ఓవర్​టైమ్​’- సునితా విలియమ్స్​కి ఇచ్చే పరిహారం ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!

Sharath Chitturi HT Telugu

Sunita William return date : ఇంకొన్ని గంటల్లో సునితా విలియమ్స్​ భూమి మీదకు తిరిగిరానున్నారు. అయితే అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపిన ఆమెకు నాసా ఎంత కాంపెన్సేషన్​ ఇస్తోందో మీకు తెలుసా? అసుల ఆమె జీతం ఎంతో మీకు తెలుసా?

ఐఎస్​ఎస్​లో తోటి వ్యోమగాములతో సునితా విలియమ్స్​.. (NASA)

9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు ఇంకొన్ని గంటల్లో భూమికి తిరిగిరానున్నారు. ఈ ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒక వారం కోసం జూన్​లో స్పేస్​కి వెళ్లిన ఈ వ్యోమగాములు.. అనుకోని పరిస్థితుల్లో 9 నెలల పాటు ఐఎస్​ఎస్​లో ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఈ కాల వ్యవధికి సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​కి 'ఓవర్​టైమ్​ కాంపెన్సేషన్​' ఏమైనా ఉంటుందా? వ్యోమగాములకు నాసా ఇప్పుడు ఎంత చెల్లిస్తుంది? అని తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది. ఆ వివరాలతో పాటు సునితా విలియమ్స్​ జీతం ఎంతో కూడా ఇక్కడ తెలుసుకోండి..

అంతరిక్షంలో సునితా విలియమ్స్​ ఓవర్​టైమ్​- పరిహారం ఎంత ఉంటుంది?

నాసా మాజీ వ్యోమగామి కాడీ కోల్​మన్​ ప్రకారం.. అస్ట్రోనాట్స్​కి సాధారణ జీతాలు మాత్రమే ఉంటాయి. ఓవర్​టైమ్​ అంటూ ఏదీ ఉండదు! జీతంతో పాటు అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ట్రాన్స్​పోర్ట్​ ఖర్చులు, అక్కడ బస, తిండి వంటి వాటిని నాసా కవర్​ చేస్తుంది. అయితే ఏదైనా సంఘటన జరిగి ఐఎస్​ఎస్​లో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే "ఇన్సిడెంటల్స్​" పేరుతో నాసా వ్యోమగాములకు డబ్బులు చెల్లిస్తుంది. అది చాలా చాలా తక్కువ!

"ఇన్సిడెంటల్స్​ పేరుతో నాసా మీకు న్యాయపరంగా కొంత మేర చెల్లిస్తుంది. ఇది చాలా తక్కువే. నాకు రోజుకు 4 డాలర్లు ఇచ్చారు," అని కోల్​మన్​ తెలిపారు.

2010-11లో కోల్​మన్​ 159 రోజులు అంతరిక్షంలో గడిపారు. అప్పుడు ఆమెకు 636 డాలర్లు (రూ. 55,000) అడిషనల్​ పేగా ఇచ్చారు. ఈ లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే.. సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లకు మొత్తం 287 రోజులకు గాను కేవలం (కనీసం) 1,148 డాలర్లు (సుమారు రూ. 1లక్ష) అదనపు కాంపెన్సేషన్​గా లభిస్తుంది.

సునితా విలియమ్స్​ జీతం గురించి కూడా పలు నివేదికలు బయటకు వచ్చాయి. generalschedule.org ప్రకారం.. సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు జీఎస్​-15 ఫెడరల్​ గవర్నమెంట్​ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. ఈ జీఎస్​-15 జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటారు. వీరి బేస్​ శాలరీ 1,25,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (సుమారు రూ. 1.08 కోట్లు- రూ. 1.41 కోట్లు) మధ్యలో ఉంటుంది.

అయితే సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు అంతరిక్షంలో 'చిక్కుకుపోయారు' అని నాసా చెప్పడం లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ఐఎస్​ఎస్​లో సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఫలితంగా వీరికి 9 నెలల జీతం అందుతుంది.

తొమ్మిది నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లకు ఆ కాల వ్యవధికి 93,850 డాలర్ల నుంచి 1,22,004 డాలర్ల (రూ. 81లక్షలు- రూ. 1.05 కోట్లు) మధ్యలో జీతాలు అందొచ్చు.

ఇక కాంపెన్సెషన్​ (సుమారు రూ.1లక్ష) కూడా కలుపుకుంటే సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​కి 94,998 డాలర్ల నుంచి 1,23,152 డాలర్ల (సుమారు రూ. 82 లక్షలు- రూ. 1.06 కోట్లు) వరకు డబ్బులు అందొచ్చు.

అయితే ఈ కాంపెన్సేషన్​ లెక్కలన్నీ కోల్​మన్​ చెప్పిన మాటల ఆధారంగా తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. 2011 తర్వాత ఈ తరహా కాంపెన్సేషన్​ని నాసా పెంచిందో లేదో తెలియదు. కోల్​మన్​ రోజుకు అందుకున్న 4 డాలర్లు.. అనంతర కాలంలో ద్రవ్యోల్బణం వల్ల పెరిగి ఉండొచ్చు. అందుకే సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లకు ఇచ్చే జీతం, కాంపెన్సేషన్​లో అడ్జెస్ట్​మెంట్స్​ వల్ల ఈ లెక్కలు మారవచ్చు.

భూమికి సునితా విలియమ్స్​..

గతేడాది జూన్​లో బోయింగ్​ స్టార్​లైనర్​లో అంతరిక్షంలోని ఐఎస్​ఎస్​కి వెళ్లారు ఈ ఇద్దరు వ్యోమగాములు. వారం తర్వాత వీరు భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్​లైనర్​లోని ప్రొపల్షన్​లో సమస్యల కారణంగా ఆ స్పేస్​క్రాఫ్ట్​ ప్రమాదకరంగా మారింది. అందుకే వారు అక్కడే ఉండిపోయారు. స్టార్​లైనర్​ ఒంటరిగా భూమికి తిరిగి వచ్చింది.

ఇక ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్​ఎక్స్​ క్రూ-10 మిషన్​ ఐఎస్​ఎస్​కి వెళ్లింది. ఈ మిషన్​లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలు​) వ్యోమగాములు గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో తీరం వద్ద నీటిలో దిగుతారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.