Heavy rainsfall: ఈ రెండు రాష్ట్రాలకు మళ్లీ వర్షం ముప్పు; రెడ్ అలర్ట్ జారీ
Heavy rainsfall: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబైలో కూడా రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Heavy rainsfall: మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర లకు వాతావరణ శాఖ శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజులు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షం, వరద ముప్పు ముంబై కి కూడా ఉందని వెల్లడించింది.
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..
సెప్టెంబర్ 15న ఉత్తర, ఆగ్నేయ మధ్య ప్రదేశ్, విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య ప్రదేశ్ లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మధ్య ప్రదేశ్లో సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 17 తేదీల మధ్య 204. 4 ఎంఎం వరకు వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. ఉత్తరాఖండ్, విదర్భ, సౌరాష్ట్ర, కచ్, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవాలకు కూడా అతి భారీ వర్షాల ముప్పు ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో 11.6 ఎంఎం నుంచి 200 ఎంఎం వరకు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం కారణంగా రానున్న మూడు, నాలుగు రోజుల్లో గుజరాత్ లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది.
కర్నాటకలో..
రానున్న రెండు రోజుల్లో కర్నాటక, తమిళనాడు, కేరళలలో ఒక మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సెప్టెంబర్ 17, 19 తేదీల మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదువుతుందని తెలిపింది. మహారాష్ట్రలో థానే, పుణె, రత్నగిరి, రాయిగఢ్, ధూలె, జలగావ్, అహ్మద్ నగర్, ఔరంగాబాద్, అకోలా, అమరావతి జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.