నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనాలు ఉన్నాయి. అయితే, రుతుపవనాలు తాకకముందే కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తిరువనంతపురం జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంల శుక్రవారం సాయంత్రం ఈ జిల్లాకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్‌ని కూడా జారీ చేసింది.
మరికొన్ని రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, రాబోయే వారంలో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో త్రిసూర్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
24 నుంచి 26 వరకు కన్నూర్, కాసర్గోడ్, మే 25, 26 తేదీల్లో మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మే 26న పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మే 24న 9, 25న 7, 26న 4, 27న 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా భారీ నుంచి అతి భారీ వర్షపాతాన్ని రెడ్ అలర్ట్ సూచిస్తుంది. ఆరెంజ్ అలర్ట్ అంటే 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మధ్య భారీ వర్షాలు కురుస్తాయని, యెల్లో అలర్ట్ 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా.
తీరం, లోతట్టు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులతో సహా ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.
కేరళ-కర్ణాటక-లక్షద్వీప్ తీరాల్లో శుక్రవారం నుంచి మే 27 వరకు చేపల వేటను నిషేధించారు.
ఇదిలావుండగా, శనివారం వివిధ తీర ప్రాంతాల్లో 3.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కోయిస్) తెలిపింది.
ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జనజీవనం స్తంభించిన వేళ ఐఎండీ హెచ్చరికలు మరింత ఆందళనకరంగా మారాయి.
మహారాష్ట్ర థానే జిల్లాలోని భివాండి-వాడా రహదారిపై బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డు ఉపరితలం (ఏఎన్ఐ) తీవ్రంగా దెబ్బతినడంతో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వర్షం కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలు గణనీయంగా మందగించాయి. కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులతో పరిస్థితి మరింత దిగజారింది.
దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పెరగడంతో పలువురు ప్రయాణికులు నాలుగు గంటలకుపైగా చిక్కుకుపోయారు.
గోవాలో మే 29 వరకు వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. మరీ ముఖ్యంగా మే 25న అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలర్ట్‌ని ఇచ్చింది.
సంబంధిత కథనం