Heatwave alert : ఇక వర్షాలు లేవు! ఈ డేట్​ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి..-heatwave returning in delhi rains pleasant weather only until this date ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heatwave Alert : ఇక వర్షాలు లేవు! ఈ డేట్​ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి..

Heatwave alert : ఇక వర్షాలు లేవు! ఈ డేట్​ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి..

Sharath Chitturi HT Telugu

IMD Heatwave : దిల్లీ సహా ఇతర ప్రాంతాల వాతావరణంపై కీలక అప్డేట్​ లభించింది. రానున్న రోజుల్లో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆ ముందు మాత్రం వర్షాలు కురుస్తాయని వివరించింది.

దిల్లీలో వర్షాలు.. (PTI)

భారీ ఉష్ణోగ్రతల అనంతరం కురిసిన వర్షాలతో దేశ రాజధాని దిల్లీలోని ప్రజలు శుక్రవారం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి దిల్లీలో హీట్​వేవ్​ పరిస్థితి కనిపిస్తుందని, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దిల్లీలో వాతావరణం అప్డేట్స్​..

శుక్రవారం సాయంత్రం దేశ రాజధానిని భారీ దుమ్ము తుపాను, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఈ తాకిడికి పలు చెట్లు నేలకూలాయి. దీనికి తోడు ఈదురుగాలుల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 15 విమానాలను దారి మళ్లించారు.

దిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాశ్రయంలో కొన్ని విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని ఎయిర్​పోర్ట్ ఆపరేటర్ డీఐఏఎల్ తెలిపింది. తాజా ఫ్లైట్ అప్డేట్స్ కోసం ప్రయాణికులు ఆయా విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఇలా..

రాజస్థాన్, ఉత్తర్​ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, సిక్కిం, ఉత్తర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్షాలు ఈ ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్​లో ఏప్రిల్ 12న, అసోం, మేఘాలయలో ఏప్రిల్ 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజా పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ఉత్తరాఖండ్​లో, ఈశాన్య- దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో రానున్న 6 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఏప్రిల్ 11 నాటి వాతావరణ బులెటిన్ ప్రకారం.. "రాబోయే 3 రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి. తరువాత 4 రోజుల్లో క్రమంగా 3-5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. రానున్న 3 రోజుల్లో మధ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2-4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 12న రాజస్థాన్​లో కొన్ని చోట్ల ధూళి తుపానులు వచ్చే అవకాశం ఉండగా, పంజాబ్, హరియాణా, ఛండీగఢ్, దిల్లీ, రాజస్థాన్​కు ఉరుములతో కూడిన తుపాను హెచ్చరికలు జారీ చేశారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.