Pawan Kalyan: ‘‘అప్పటికింకా ఆయన పుట్టలేదు..’’: పవన్ కళ్యాణ్ పై డీఎంకే నేత వ్యంగ్య వ్యాఖ్యలు
Pawan Kalyan: బలవంతంగా హిందీని తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు అధికార పార్టీ డీఎంకేపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ప్రతిగా డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ స్పందించారు.
Pawan Kalyan: తమిళనాడులో కొనసాగుతున్న హిందీ భాషా వివాదంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన 'సినిమా డబ్బింగ్' వ్యాఖ్యలపై అధికార డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ.. ‘‘ఆయనకు రాష్ట్ర రాజకీయాల గురించి ఏమీ తెలియదు’’ అని ఆరోపించారు. జాతీయ విద్యా విధానం (nep) 2020 కింద త్రిభాషా విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్న అంశంపై కేంద్రంతో తమిళనాడు ప్రభుత్వం విబేధిస్తోంది. తాజాగా, బడ్జెట్ లోగో నుంచి జాతీయ కరెన్సీ సింబల్ ను తొలగించి తమిళంలో ‘రు’ ను చేర్చింది.
డీఎంకే నేతలది హిపోక్రసీ
ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ వేడుకల సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డీఎంకే తీరును విమర్శించారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని డీఎంకే నేతలు అనడం హిపోక్రసీ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ తమిళనాడుు నాయకులు ఒకవైపు హిందీని వ్యతిరేకిస్తునే, మరోవైపు ఆర్థిక లాభాల కోసం తమిళ సినిమాలను హిందీ భాషలోకి డబ్ చేస్తుంటారని విమర్శించారు. ‘‘బాలీవుడ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాత్రం వద్దు. అది ఎలాంటి లాజిక్? కొందరు సంస్కృతాన్ని ఎందుకు విమర్శిస్తారో అర్థం కాదు’’ అన్నారు. కాకినాడలోని పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
ఆయనకేం తెలియదు
పవన్ వ్యాఖ్యలను డీఎంకే నేత ఇళంగోవన్ తోసిపుచ్చారు. 1938 నుంచి హిందీ భాషపై తమిళనాడు రాష్ట్రానికి ఉన్న దీర్ఘకాలిక వ్యతిరేకతను డీఎంకే నేత ఇళంగోవన్ గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు కాదు.. 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాం. తమిళనాడు ఎప్పుడూ ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తుంది.. కానీ నటులను కాదు. విద్యా నిపుణుల సలహాలు, సూచనలతోనే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశాం. 1968లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇంకా పుట్టలేదు. ఆయనకు తమిళనాడు రాజకీయాలు తెలియవు’’ అని ఇళంగోవన్ ఎద్దేవా చేశారు.
బీజేపీ మెప్పు కోసమే..
"మేము హిందీని వ్యతిరేకించడం ఇది మొదటిసారి కాదు, ఎందుకంటే మాతృభాషలో విద్యాబోధన ఉత్తమ మార్గం అని మేము నమ్ముతున్నాము" అని ఇళంగోవన్ అన్నారు. బీజేపీని ఆకట్టుకోవడానికే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి నుంచి ఆయన ఏదో ఆశిస్తున్నారని తమిళనాడు నేత ఆరోపించారు.
తమిళనాడులో ఎన్ఈపీ
2020 జాతీయ విద్యావిధానం (NEP) అమలును తీవ్రంగా వ్యతిరేకించిన తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా సూత్రంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్రం హిందీని 'రుద్దాలని' చూస్తోందని ఆరోపించింది. రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పినా తమిళనాడులో ఎన్ఈపీని అమలు చేయబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత నెలలో స్పష్టం చేశారు.
సంబంధిత కథనం