సోషల్ మీడియా కాలంలో మోసాలు పెరిగిపోయాయి. అనేక రకాల ప్రకటనలు ఇస్తూ డబ్బు దండుకుంటున్నారు మోసగాళ్లు. ఎలా వీలైతే అలా డబ్బును సంపాదించేందుకు మోసాలకు పాల్పడుతున్నారు. నమ్మిన వారిని ముంచేస్తున్నారు. ఒక్కసారి వారి చేతికి చిక్కితే అంతే సంగతులు.. డబ్బు వచ్చేదాకా ఏదో మాయమాటలు చెబుతూనే ఉంటారు. ఇలానే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో సంతానం లేని స్త్రీలను గర్భవతిని చేసి డబ్బు సంపాదించండి అంటూ ప్రకటన ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. ఓ వైపు మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్లతో అనేక రకాలుగా డబ్బులు దోచుకుంటున్న వారిని చూస్తూనే ఉన్నాం. మరోవైపు సోషల్ మీడియాలో ఇంట్లో కూర్చొని రోజుకు ఐదు నుంచి పది వేలు సంపాదించవచ్చని నకిలీ జాబ్ ఆఫర్లు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇలానే ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మోసగాళ్లు పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేసి లక్షలు సంపాదించండి అంటూ సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంతానం లేని మహిళలను గర్భిణులను చేసి డబ్బు సంపాదించాలనే వివాదాస్పద ప్రకటన ఇస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ సంఘటన హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగింది, ఇద్దరు మోసగాళ్ళు 'పిల్లలు లేని స్త్రీలను గర్భవతిని చేయండి, భారీగా డబ్బు సంపాదించండి..' అని ఆన్‌లైన్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు పోస్ట్ చేశారు. ప్రజల నుండి డబ్బును దోపిడీ చేయడం ప్రారంభించారు. మోసగాళ్లు నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసేవారు. అలాగే వ్యక్తులను ట్రాప్ చేసేందుకు మహిళల నకిలీ ఫొటోలు పంపి రిజిస్ట్రేషన్, ఫీజులు వసూలు చేస్తూ డబ్బులు దండుకునేవారు.
ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వివాదాస్పద ప్రకటన చూసి పోలీసులు షాకయ్యారు. ఆపై విచారణ జరిపి విచారణలో నాలుగు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు, ప్రకటనలు బయటపడ్డాయి. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులు ఎజాజ్, ఇర్షాద్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నూహ్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.