Mining Mafia : పోలీసు అధికారినే ట్రక్‌తో తొక్కించి చంపారు
Mining Mafia : హరియాణాలో మైనింగ్ మాఫియా ఆగడాలకు ఇది మరో ఉదాహరణ. అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటున్నందుకు డీఎస్పీ స్థాయి అధికారినే ట్రక్‌తో తొక్కించి చంపారు.
Mining Mafia : హరియాణాలోని పచ్‌గావ్‌లో సోమవారం ఈ దారుణం జరిగింది. అక్రమ మైనింగ్ సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన తౌరు డీఎస్పీ సురేంద్ర కుమార్ బిష్ణోయిను మైనింగ్ మాఫియా ట్రక్‌తో ఢీ కొట్టి చంపేసింది.
Mining Mafia : అక్రమ మైనింగ్
తౌరు ప్రాంతంలోని తౌడు గుట్టల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తౌరు డీఎస్పీ సురేంద్ర కుమార్ బిష్ణోయికి సమాచారం అందింది. దాంతో, ఆయన ఆ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం ఆ ప్రాంతానికి తనిఖీకి వెళ్లారు. తన అధికారిక వాహనం పక్కన నిలుచుని, అక్రమ మైనింగ్ మెటీరియల్‌తో వస్తున్న ఒక ట్రక్‌ను ఆపాలని ఆ ట్రక్ డ్రైవర్‌కు సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఆ ట్రక్ డ్రైవర్ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా, నేరుగా ట్రక్‌ను డీఎస్పీ సురేంద్ర కుమార్ బిష్ణోయి పైకి తీసుకువెళ్లాడు. వేగంగా దూసుకువెళ్లి, డీఎస్పీ ని ఢీ కొట్టాడు. దాంతో, ఆయన ఆ ట్రక్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. డీఎస్పీ గన్‌మెన్, డ్రైవర్ పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే డీఎస్పీ సురేంద్రను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
Mining Mafia : డ్రైవర్ పరారీ
ఈ దారుణం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆ ట్రక్ డ్రైవర్ ట్రక్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. ఆ డ్రైవర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హరియాణా పోలీసు యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. డీఎస్పీ దారుణ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. సురేంద్ర 1994లో ఎస్సైగా హరియాణా పోలీసు విభాగంలో చేరారు. పదోన్నతులపై ప్రస్తుతం డీఎస్పీగా తౌరులో విధుల్లో ఉన్నారు. మరికొద్ది నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు.
Mining Mafia : ప్రభుత్వ వైఫల్యమే
మైనింగ్ మాఫియా ఈ దారుణానికి తెగబడడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని విమర్శించింది. పోలీసు అధికారికే భద్రత కరువైన రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ట్వీట్ చేసింది.