Haryana BJP chief: హర్యానా బీజేపీ చీఫ్ పై గ్యాంగ్ రేప్ కేసు; ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని..
Haryana BJP chief: బీజేపీ నేత మోహన్ లాల్ బడోలి పై సామూహిక అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైంది. ఆయనతో పాటు గాయకుడు రాకీ మిట్టల్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ ఆరోపణలను బడోలి ఖండించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.
Haryana BJP chief: ఢిల్లీకి చెందిన ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా భారతీయ జనతా పార్టీ (BJP) హర్యానా శాఖ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు గాయకుడు జై భగవాన్ అలియాస్ రాకీ మిట్టల్ లపై హిమాచల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 13న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, కసౌలిలోని హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (HPTDC) యొక్క రోస్ కామన్ హోటల్లో జూలై 3, 2023 న ఈ నేరం జరిగింది. సోలన్ జిల్లాలోని కసౌలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 376డీ (గ్యాంగ్ రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు.
బాధితురాలికి బెదిరింపు
ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని నిందితులు బెదిరించారని పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అవేమిటో తనకు తెలియదని బడోలీ కొట్టిపారేశారు. ఢిల్లీకి చెందిన తన యజమాని, స్నేహితుడితో కలిసి హిమాచల్ ప్రదేశ్ హోటల్లో బస చేసినప్పుడు రాజకీయ నాయకుడు మోహన్ లాల్ బడోలి, గాయకుడు రాకీ మిట్టల్ అలియాస్ జై భగవాన్ లను కలిశానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో సింగర్ జై భగవాన్ తనకు మ్యూజిక్ వీడియోలో నటించే అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని ఆమె చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని..
అలాగే, తనకు ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్నాయని, సులభంగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోహన్ లాల్ బడోలి ఆఫర్ చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం, నిందితులు తమను బలవంతంగా మద్యం తాగించి, తనపై లైంగిక దాడి చేశారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, వాటిని వైరల్ చేస్తామని, చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపారు. మళ్లీ రెండు నెలల క్రితం తనను వారు పిలిపించి తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికిస్తామని బెదిరించారని బాధితురాలు పేర్కొంది.