Hamas chief death: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ హత్యతో గాజా యుద్ధం ముగుస్తుందా?.. నెక్స్ట్ ఏంటి?
Hamas chief death: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో ఆ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వర్ చనిపోయాడు. అయితే, యాహ్యా సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ముగుస్తుందా?.. హమాస్ కోలుకుని, ఎదురుదాడులు చేయగలదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Hamas chief Yahya Sinwar death: రఫాలో బుధవారం జరిగిన సైనిక చర్యలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ మరణించినట్లు ధ్రువీకరిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. యాహ్యా సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీని ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది. తీవ్రంగా గాయపడిన యాహ్యా సిన్వర్ ఆ డ్రోన్ పై ఒక వస్తువును విసురుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
యుద్ధం ముగింపు
యాహ్యా సిన్వర్ మరణ వార్త వినగానే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు హర్షాతిరేకాలతో ఇలా స్పందించాడు. ‘‘పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ ను అంతమొందించడం యుద్ధం ముగింపుకు నాంది’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే, ఆయన పూర్తిస్థాయి కాల్పుల విరమణకు హామీ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ బందీలందరినీ వెనక్కి రప్పించే వరకు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. హమాస్ దుష్టపాలన పతనానికి సిన్వర్ మరణం ఒక ముఖ్యమైన మైలురాయిగా నెతన్యాహు అభివర్ణించారు. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ అక్టోబర్ 7న జరిపిన దాడి వెనుక సిన్వార్ సూత్రధారి అని ఆరోపించారు.
యాహ్యా సిన్వార్ మరణం ఎందుకు ముఖ్యమైనది?
యాహ్యా సిన్వార్ మరణం హమాస్ కు, అలాగే ఇరాన్, లెబనాన్, యెమెన్ లలో ఉన్న ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులకు పెద్ద ఎదురు దెబ్బ. హమాస్ చీఫ్ గానే కాకుండా, ఇతర మిలిటెంట్ సంస్థల మధ్య సమన్వయ కర్తగా కూడా యాహ్యా సిన్వార్ పేరు గాంచాడు. హమాస్ కీలక నేతలు చనిపోవడం గతంలో కూడా జరిగింది. 2024 జూలైలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, మిలటరీ కమాండర్ మహ్మద్ డీఫ్ కూడా హతమయ్యారు. ఇప్పుడు యాహ్యా సిన్వార్ మరణించాడు. అయితే, సిన్వార్ మరణించడంతో హమాస్ తదుపరి అధినేత ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ప్రతిఘటన పెరుగుతుంది..
మరోవైపు, సిన్వర్ హత్య ఈ ప్రాంతంలో "ప్రతిఘటన" బలపడటానికి దారితీస్తుందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ పేర్కొంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సిన్వర్ మరణం తరువాత, "హమాస్ కు సంబంధం లేకుండా గాజాలో పాలస్తీనియన్లకు మంచి భవిష్యత్తును అందించే రాజకీయ పరిష్కారానికి ఇప్పుడు అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.
కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు
ఇజ్రాయెల్ బందీలను తిరిగి ఇవ్వడానికి సిన్వర్ నిరాకరించారని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించడానికి కూడా ఆయన నిరాకరించారని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఇప్పుడు కాల్పుల విరమణకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని, శాంతి ప్రక్రియ దిశగా తమ ప్రయత్నాలను రెట్టింపు చేయవచ్చని అన్నారు.
టాపిక్