H-1B Visa: 2025 జనవరి 17 నుంచి ఆధునీకరించిన 2025 హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ను అమలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడంలో నిష్పాక్షికత, పారదర్శకత, సమర్థతను నిర్ధారించడం ఈ చర్య లక్ష్యం.
"హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్ లో చేపట్టిన ఈ అప్ డేట్స్ ప్రపంచ ప్రతిభావంతులను నియమించుకోవడానికి, మా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచడానికి, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి యజమానులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందించడానికి వీలు కల్పిస్తాయి" అని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో ఎన్ మయోర్కాస్ చెప్పారు.
హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేవారిలో భారతీయులు అధికంగా ఉంటారు. యూఎస్ ప్రారంభించనున్న కొత్త నిబంధనలు, సంస్కరణలు భారతీయ నిపుణులకు కొంత ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. 2023 లో జారీ చేసిన 3,86,000 హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా 72.3 శాతంగా ఉంది. హెచ్1 బీ వీసా సిస్టమ్ తో పాటు ఎల్ 1, స్టూడెంట్ వీసాల ప్రక్రియలో కూడా పలు సంస్కరణలను తీసుకువచ్చారు. యూఎస్ వీసా సిస్టమ్ లో చేపట్టిన సంస్కరణలకు సంబంధించి 2024 డిసెంబర్ 18న విడుదల చేసిన కొత్త నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పులను ప్రతిబింబించేలా సవరించిన ఫారం ఐ-129ను 2025 జనవరి 17న యూఎస్సీఐఎస్ (USCIS) ప్రచురించనుంది.