H1B visa: హెచ్1బీ వీసా పై యూఎస్ లో సర్వే; 60% అమెరికన్లు వద్దంటున్నారు!
H1B visa: అమెరికా వ్యాపార సంస్థలు విదేశీ కార్మికులను నియమించుకునేందుకు అనుమతించే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ గురించి అమెరికాలో నిర్వహించిన ఒక సమగ్ర సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హెచ్1బీ వీసా విధానంలో ట్రంప్ కీలక సంస్కరణలు తీసుకురానున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
H1B visa survey: ప్రస్తుతం కొనసాగుతున్న హెచ్ 1-బి వీసా విధానంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనవరి 20న తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ (donald trump).. హెచ్ 1 బీ వీసా విధానంలో పలు సంచలన సంస్కరణలు తీసుకురానున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తాజాగా హెచ్1 బీ వీసా (visa) విధానంపై నిర్వహించిన ఒక సర్వే ఫలితాలు సంచలనంగా మారాయి.
విదేశీ ఉద్యోగులు అక్కర్లేదు..
వైట్ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు చేయడానికి యుఎస్ లో ఇప్పటికే తగినంత నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని, నిపుణులైన విదేశీ ఉద్యోగుల అవసరం ఇక లేదని ప్రతీ 10 మంది అమెరికన్లలో ఆరుగురు, అంటే 60% మంది అభిప్రాయపడ్డారని ఆ సర్వేలో తేలింది. కాగా, ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి వంటివారు హెచ్-1బీ పొడిగింపును సమర్థిస్తుండగా, స్టీవ్ బానన్, నిక్కీ హేలీ, లారా లూమర్ వంటి వారు వ్యతిరేకిస్తున్నారు.
రాస్ ముస్సేన్ రిపోర్ట్స్ పోల్
నవంబర్ లో నిర్వహించిన రాస్ ముస్సేన్ రిపోర్ట్స్ పోల్ లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం.. ఎక్కువ మంది అమెరికన్లు హెచ్ 1-బి వీసా (h1b visa) వంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. నిపుణులైన ఉద్యోగుల కొరత కంటే.. నిరుద్యోగం వంటి దేశీయ సమస్యల పరిష్కారం ముఖ్యమైనదని భావిస్తున్నారు. అయితే, వారి అభిప్రాయాలకు భిన్నంగా, కార్మికుల కొరతను తీర్చడానికి హెచ్ -1 బి వీసా కార్యక్రమాన్ని విస్తరించాలని మస్క్ పిలుపునివ్వడం గమనార్హం.
26 శాతం మాత్రమే అనుకూలం..
26 శాతం మంది అమెరికన్లు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ఎక్కువ మంది విదేశీ కార్మికులను నియమించడానికి అనుకూలంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. 60 శాతం మంది అమెరికన్లు మాత్రం వైట్ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు చేయడానికి యుఎస్ లో ఇప్పటికే తగినంత నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని, నిపుణులైన విదేశీ ఉద్యోగుల అవసరం ఇక లేదని భావిస్తున్నారు.
హెచ్ 1 బీ పై భిన్నాభిప్రాయాలు
అమెరికాలోని సంస్థలు కీలక పదవుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతించే హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్ గురించి యూఎస్ లో ఇటీవల పెద్ద చర్చ ప్రారంభమైంది. స్టీవ్ బానన్, లూమర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని విస్తరించడాన్ని వ్యతిరేస్తుననారు. మరోవైపు, కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓజీఈ) సహనాయకులుగా ట్రంప్ నామినేట్ చేసిన మస్క్ (elon musk) , రామస్వామి తదితర నాయకులు హెచ్ 1 బీ వీసా విధానాన్ని విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అంతర్గత విభేదాల మధ్య హెచ్-1బీ వీసాలకు ట్రంప్ మద్దతు ప్రకటించారు.
మస్క్ కంపెనీలకు చాలా అవసరం..
అమెజాన్ (amazon), గూగుల్ (google), మెటా సంస్థలు 2024లో వందలాది హెచ్-1బీ వీసాలను దక్కించుకున్నాయి. నివేదికల ప్రకారం, మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా యునైటెడ్ స్టేట్స్ లో వందలాది మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ విధానం సహాయపడింది. హెచ్1 బీ వీసాలు ఉన్న కార్మికులు తాత్కాలికంగా అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి అనుమతిస్తారు.
అమెరికన్లకే ఉద్యోగాలు
యూఎస్ లో మ్యానుఫాక్చరింగ్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్ వంటి రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత ఉంది. అయితే, వారు ఆ ఉద్యోగాల్లో నిరుద్యోగులైన అమెరికన్లను నియమించుకోవాలని 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు దేశంలో తగినంత నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని వారు పేర్కొన్నారు. విదేశీ కార్మికులను నియమించుకోవడం ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుందని 24 శాతం మంది మాత్రమే అంగీకరించారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో విదేశీ కార్మికులను నిషేధిస్తూ, ఇలాంటి ఉద్యోగాలు కోరుకునే అమెరికన్లకు రక్షణ కల్పిస్తూ హెచ్-1బీ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం సవరించింది.