Gujarat Election 2022: గుజరాత్ తుది దశ పోలింగ్‍కు సర్వం సిద్ధం.. మరికొన్ని గంటల్లో..
Gujarat Election 2022 final phase Poll: గుజరాత్‍లో తుదిపోరుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో (డిసెంబర్ 5) శాసనసభ ఎన్నికల తుది దశ పోలింగ్ షురూ కానుంది.
Gujarat Election 2022 final phase Polling: ఉద్ధృతంగా సాగిన ప్రచార హోరు తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‍కు కౌంట్‍డౌన్ మొదలైంది. సోమవారం (డిసెంబర్ 5) రెండో దశ పోలింగ్ జరగనుంది. మొత్తంగా ఉత్తర, సెంట్రల్ గుజరాత్ ప్రాంతాల పరిధిలోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలవుతుంది. మొత్తంగా 93 స్థానాల్లో 833 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 61 పార్టీలు బరిలో ఉండగా.. అధికార బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), ఆమ్‍ఆద్మీ (Aam Aadmi Party) మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.
గుజరాత్‍లో మొత్తంగా 182 శాసనసభ స్థానాలు ఉండగా.. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఈనెల 1వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగింది. రేపు తుది దశలో భాగంగా 93 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ దశలో 833 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 285 మంది ఇండిపెండెట్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది.
26వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు
Gujarat Election 2022 final phase Polling: రెండో దశలో భాగంగా 93 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరనుండగా.. 2.51కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా ఈ గుజరాత్ అసెంబ్లీ తుది దశ పోలింగ్ కోసం 26,409 పోలింగ్ బూత్‍లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. 36,000కుపైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVM)లను వినియోగించనుంది. సుమారు 29వేల మంది ప్రెసీడింగ్ ఆఫీసర్లు, 84,000 మందిపైగా పోలింగ్ అధికారులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. 2,51,58,730 మంది ఓటర్లలో 1,22,31,335 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
బీజేపీ, ఆప్ అన్ని స్థానాల్లో..
Gujarat Election 2022 final phase Polling: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జరిగే 93 స్థానాల్లో అధికార బీజేపీ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‍ఆద్మీ పార్టీ పోటీలో నిలిచాయి. కాంగ్రెస్ 90 స్థానాల్లో బరిలో ఉంది. మిత్రపక్షమైన ఎన్‍సీపీకి మూడు స్థానాలు కేటాయించింది హస్తం పార్టీ. బీఎస్‍పీ కూడా 44 చోట్ల పోటీ చేస్తోంది.
గుజరాత్‍లోని అహ్మదాబాద్, గాంధీనగర్, మెహెసనా, పాటన్, బనాస్‍కాంఠా, సాబర్ కాంఠా, అరవళి, మహిసాగర్, పంచ్‍మహల్, దాహోద్, వడోదరా, ఆనంద్, ఖేడా, చోటా ఉదయ్‍పూర్ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఈ రెండో దశ పోలింగ్ జరుగుతుంది.
ప్రముఖ స్థానాలు
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక పటీదార్ నేత హార్దిక్ పటేల్ ఈసారి బీజేపీ చరఫున విరామ్‍నగర్ నుంచి బరిలో ఉన్నారు. గాంధీ నగర్ సౌత్‍లో అల్పేశ్ థాకూర్ ను కషాయ పార్టీ బరిలోకి దింపింది.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్‍రామ్ రఠవా.. చోటా ఉదయ్‍పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జిగ్నేశ్ మెవానీ, లఖాభాయ్ భర్వాడ్, అమీ యాజ్నిక్‍తో పాటు మరికొందరు ప్రముఖులు.. ఈ రెండో దశ ఎన్నికల్లోనే పోటీలో ఉన్నారు.
దేవద్‍బారియా, దేవ్‍ధర్, గాంధీనగర్ సౌత్, విరామ్‍నగర్ సహా మరిన్ని స్థానాల్లో ఆప్ నుంచి బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
27 సంవత్సరాల నుంచి గుజరాత్‍లో బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇక ఆమ్‍ఆద్మీ పార్టీ సైతం దూసుకొచ్చింది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉంది. ఈనెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.