Bus Accident : లోయలో పడిన బస్సు- ఐదుగురు దుర్మరణం!
Bus accident: గుజరాత్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది! యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు హైవే మీద నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు.. డాంగ్ జిల్లాలో నాసిక్- గుజరాత్ హైవే మీద నుంచి పక్కనే ఉన్న 35 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తెలుస్తోంది. 17మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

ఇదీ జరిగింది..
గుజరాత్‌లోని సపుతారా హిల్ స్టేషన్‌కి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలుత బస్సు నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉండే క్రాష్ బేరియర్ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
బస్సు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకాకు యాత్రికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
బస్సు లోయలో పడిన సమయంలో వాహనంలో 48మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోందని సపుతార హిల్ స్టేషన్ ఎస్పీ ఎస్.జీ పాటిల్ తెలిపారు.
"ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం మీద ఐదుగురు యాత్రికులు మృతి చెందగా, మరో 17 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని అహ్వాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది," అని అధికారులు తెలిపారు.
యాత్రికులు మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందినవారని అధికారులు గుర్తించారు.
ఎస్యూవీ బోల్తా- ఐదుగురు మృతి!
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ ఎస్యూవీ బోల్తాపడటంతో అందులోని ఐదుగురు మరణించిన ఘటన బిహార్‌లో తాజాగా చోటుచేసుకుంది. మృతులు నేపాల్‌కి చెందిన వారు. మహా కుంభమేళా 2025 నుంచి తిరిగొస్తున్న సమయంలో, రోడ్డు మీద స్టంట్స్ చేస్తున్న బైక్‌ని తప్పించుకోబోయే క్రమంలో వాహనం బోల్తా కొట్టింది.
బిహార్ ముజాఫర్పూర్ జిల్లాలోని మధుబాని 4-లేన్ బైపాస్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. స్కార్పోయో ఎస్యూవీ రోడ్డు మీద వెళుతుండగా.. డ్రైవర్‌కి ఎదురుగా స్టంట్స్ చేస్తున్న బైకర్ కనిపించాడు. అతడి నుంచి తప్పించుకోబోయే క్రమంలో ఈ ఎస్యూవీ తొలుత డివైడర్ని ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఐదుసార్లు పల్టీ కొట్టి, చివరికి నేల మీద క్రాష్ అయ్యింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. విండోలు విరిగిపోయాయి. కారుకు చెందిన ఒక టైరు విరిగి, కేబిన్లోపల ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 9మంది ఉన్నారు. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోవడంతో, ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు, మిగిలిన వారు గాయపడ్డారు. వీరిలో పలువురు ఆరోగ్యం విషమంగా ఉంది. వీరందరు నేపాల్‌కి చెందిన వారు అని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
కారు గాల్లో పల్టీ కొడుతుండటాన్ని చూసిన బైకర్లు.. భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.
సంబంధిత కథనం