Gujarat: సూరత్ లో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం-gujarat 6 floor building collapses in surat several feared trapped ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat: సూరత్ లో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

Gujarat: సూరత్ లో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

HT Telugu Desk HT Telugu
Published Jul 06, 2024 07:50 PM IST

Gujarat: గుజరాత్ లోని సూరత్ నగరంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడ్డారు. శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.

సూరత్ లో కుప్పకూలిన భవనం
సూరత్ లో కుప్పకూలిన భవనం (X/PTI)

Gujarat: గుజరాత్ లోని సూరత్ లో ఉన్న సచిన్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఒక్కసారిగా కుప్పకూలింది..

‘‘ఆరు అంతస్తుల భవనం కూలిపోయినట్లు మాకు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని రక్షించాం. కానీ, శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నాం. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి’’ అని సూరత్ కలెక్టర్ సౌరభ్ పర్ధి తెలిపారు. ‘‘ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సచిన్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవనంలో నివసిస్తున్న చాలా మంది లోపల చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను విజయవంతంగా రక్షించారు. భవనం లోపల ఉన్న 30 ఫ్లాట్లలో చాలా ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. ఆ భవనంలో చాలా మంది పనిలో ఉన్నారు. కొందరు నైట్ షిఫ్ట్ తరువాత నిద్ర పోతున్నారు. వారంతా శిధిలాల కింద చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్నీ సహాయ చర్యల్లో ఉన్నాయి’’ అని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌత్ తెలిపారు.

మరో భవనం కూడా

ఈ ఏడాది మార్చిలో మోర్బి పట్టణంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఏడు గంటల పాటు శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించారు. కొత్త భవనం మొదటి అంతస్తులో కార్మికులు పనిలో ఉండగా మార్చి 9 రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో ఘటనలో జూన్ 30న ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో పాత భవనం పైకప్పు కూలి ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జరిగినప్పుడు బాలుడు డాబాపై ఆడుకుంటున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.