ఉదయపూర్‌లోని ఒక బిజీ మార్కెట్లో కన్హయ్యలాల్ అనే టైలర్ దారుణ హత్య రాజస్తాన్‌లో సంచలనంగా మారింది. ఈ హత్యతో టూరిస్ట్ టౌన్ ఉదయ్‌పూర్ సహా రాష్ట్రవ్యాప్తంగా రెండు ప్రధాన వర్గాల మధ్య శత్రుత్వం నెలకొంది.
నుపుర్ శర్మ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఉదయ్‌పూర్‌లో సోషల్ మీడియాలో ఆమెను సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ మెసేజెస్ వార్ నడుస్తోంది. టైలర్ కన్హయ్యలాల్ కూడా ఆ వార్‌లో కీలకంగా వ్యవహరించాడు. నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్‌లు పెట్టాడు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్నాయన్న కారణంతో ఈ పోస్ట్‌లు చేసినవారు, సంబంధిత గ్రూప్‌లు, పేజ్‌ల అడ్మిన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కన్హయ్యలాల్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు.
ఉదయ్‌పూర్‌లోని ఒక బిజీ మార్కెట్లో ఉన్న ఒక షాప్‌లో కన్హయ్య లాల్ టైలర్‌గా ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం కన్హయ్య షాపులో ఉండగా, ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి, కత్తితో కన్హయ్యపై దాడి చేశారు. విచక్షణారహితంగా పొడిచారు. ఆ తరువాత, దారుణమైన రీతిలో తలను నరికారు. ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఆ తరువాత, ఆ దారుణం ఎలా చేశారో, కెమెరా ముందు గొప్పగా చెప్పుకున్నారు. ఇదే దుర్గతి ప్రధాని మోదీకి కూడా పడుతుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి, విస్తృతంగా వైరల్ చేశారు.
ఈ ఘటనతో ఉదయ్‌పూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైరల్ అయిన ఆ దారుణ వీడియోను చూసి ఒక వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. పట్టణంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు పట్టణవ్యాప్తంగా బందోబస్తును విస్తృతం చేశారు. కన్హయ్య లాల్ హత్యకు సంబంధించిన వీడియోను ఎవరూ చూడవద్దని, దాన్ని షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ వీడియో చాలా దారుణంగా ఉందని, సున్నిత మనస్కులు చూస్తే తట్టుకోలేరని, ఆ వీడియోను ఎవరూ చూడవద్దని రాజస్తాన్ ఏడీజీ హవాసింగ్ ఘుమారియా వ్యాఖ్యానించారు. ఆ వీడియోను బ్లర్ చేసి కూడా టెలీకాస్ట్ చేయవద్దని మీడియాను కోరారు. ఉదయ్‌పూర్‌లో ఇంటర్నెట్‌ను నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని కొందరు కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రలో భాగం కావద్దని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో దోషులను అతిత్వరలో పట్టుకుని, కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
టాపిక్