యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న జనగణనపై కేంద్రం సోమవారం అధికారిక నోటిఫికేషన్ని జారీ చేసింది. 2027 సెన్సస్ రెండు దశల్లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌లో 2027 జనాభా గణన కోసం రిఫరెన్స్ తేదీని కూడా ప్రకటించింది.
తొలి దశలో భాగంగా లద్దాఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచుతో నిండిన ప్రాంతాలకు అక్టోబర్ 1, 2026ని రిఫరెన్సీ తేదీగా కేంద్రం ప్రకటించింది. రెండో దశలో మార్చ్ 1, 2027ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీగా ఉంటుందని తెలియజేసింది.
"లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన ప్రాంతాలు మినహా, సదరు జనగణనకు రిఫరెన్స్ తేదీ మార్చ్ 1, 2027న 00.00 గంటలుగా [అర్ధరాత్రి 12 గంటలు] ఉంటుంది," అని హోం మంత్రిత్వ శాఖ తన తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
"లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన ప్రాంతాలకు సంబంధించి, రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1, 2026న 00:00 గంటలుగా ఉంటుంది," అని నోటిఫికేషన్‌లో ఉంది.
వాస్తవానికి 2021లో జనగణన జరగాల్సి ఉంది. కానీ కొవిడ్ సంక్షోభం కారణంగా ఇండియాలో జనాభా లెక్కలు ఆలస్యమవుతూ వచ్చాయి. చివరికి, 2026లో మొదలవుతాయి.
1948 జనగణన చట్టం, 1990 జనగణన నిబంధనల ప్రకారం భారత జనగణనను నిర్వహిస్తారు.
భారతదేశంలో చివరి జనగణన 2011లో రెండు దశల్లో జరిగింది. i) మొదటి దశ – హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ) (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2010 వరకు). ii) రెండొవ దశ – జనాభా గణన (పీఈ) (ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28, 2011 వరకు).
2021 జనగణన కూడా ఇదే విధంగా రెండు దశల్లో, మొదటి దశ ఏప్రిల్-సెప్టెంబర్ 2020లో, రెండవ దశ ఫిబ్రవరి 2021లో నిర్వహించడానికి కేంద్రం ఆ సమయంలో ప్రతిపాదించింది.
"2021లో నిర్వహించాల్సిన జనగణన మొదటి దశకు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి, కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఫీల్డ్ వర్క్ ఏప్రిల్ 1, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ప్రబలడం వల్ల, జనగణన పనులు వాయిదా పడ్డాయి," అని ఆ సమయంలో ప్రభుత్వం తెలిపింది.
2027 సెన్సస్ పనులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొంతకాలంగా ఫోకస్ చేశారు. ఇదే విషయంపై ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల్లో స్వీయ గణన కూడా ఉంటుందని ఆయన అన్నారు.
అంతేకాదు, ఈసారి జనగణనలో కుల గణన కూడా ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
సంబంధిత కథనం