‘భారత్ వైపు కన్నెత్తి చూస్తే విధ్వంసమే.. ఘర్ మే ఘుస్కే మారెంగే’: ప్రధాని మోదీ వార్నింగ్-ghar me ghuske maarenge at adampur air base pm modis warning echoes again ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘భారత్ వైపు కన్నెత్తి చూస్తే విధ్వంసమే.. ఘర్ మే ఘుస్కే మారెంగే’: ప్రధాని మోదీ వార్నింగ్

‘భారత్ వైపు కన్నెత్తి చూస్తే విధ్వంసమే.. ఘర్ మే ఘుస్కే మారెంగే’: ప్రధాని మోదీ వార్నింగ్

Sudarshan V HT Telugu

ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి వీర జవాన్లతో మట్లాడారు. ఎస్ 400 బ్యాక్ డ్రాప్ లో నిలబడి జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మరోసారి పాకిస్తాన్ కు, ఉగ్రవాదులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

మోదీ వార్నింగ్ ((Indian Prime Minister's Office on X via AP)

పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. అక్కడ ప్రసంగిస్తూ, పాకిస్తాన్ కు, ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఇళ్లల్లోకి దూరి మరీ చంపేస్తాం’’ అని మరోసారి హెచ్చరించారు. రెండు రోజుల క్రితం అమెరికా మధ్యవర్తిత్వంలో భారత్, పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో, ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇళ్ల లోపలికి వెళ్లి హతమారుస్తాం..

ఉగ్రవాదులను హతమార్చడానికి తాము వారి ఇళ్లల్లోకి సైతం అడుగుపెట్టడానికి వెనుకాడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘‘హమ్ ఘర్ మే ఘుస్ కర్ మారేంగే ఔర్ బచ్నే కా ఏక్ మౌకా తక్ నహీ దేంగే…’’ (ఇంటింటికి వెళ్లి మరీ హతమారుస్తాం. వారు తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వబోం) అని హెచ్చరించారు. "మేము గాడ్ ఫాదర్ లు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ మద్దతుదారుల మధ్య తేడాను గుర్తించము" అని అన్నారు. వారు తమకు ఉగ్రవాదులతో సమానమేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం పంజాబ్ లోని అదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లి వైమానిక దళ సిబ్బందితో మాట్లాడారు.

ఘర్ మే ఘుస్ కర్ మారేంగే

ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు శక్తివంతమైన హెచ్చరికగా ప్రధాని మోదీ పదేపదే 'ఘర్ మే ఘుస్కే మారెంగే' అనే పదబంధాన్ని ఉపయోగిస్తున్నారు. జాతీయ భద్రత, సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ దుందుడుకు వైఖరికి ఈ పదబంధం ప్రతీకగా మారింది. 2016 సర్జికల్ దాడుల నుంచి 2019 బాలాకోట్ వైమానిక దాడుల వరకు ప్రధాని మోదీ ఈ లైన్ ను ఉపయోగించారు. రెచ్చగొట్టినట్లయితే సరిహద్దులు దాటి కూడా భారత్ సాహసోపేతమైన, ముందస్తు చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోదని సంకేతాలు ఇచ్చారు.

సైనికులకు సెల్యూట్

వైమానిక దళం, నౌకాదళం, సైన్యంలోని ధైర్యవంతులైన సైనికులకు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. 'ఈ మొత్తం ఆపరేషన్లో ప్రతి భారతీయుడు మీకు అండగా నిలిచాడు. ప్రతి భారతీయుడి ప్రార్థనలు మీ అందరితోనే ఉన్నాయి... నేడు దేశంలోని ప్రతి పౌరుడు సైనికులకు, వారి కుటుంబాలకు రుణపడి ఉంటాడు. ఆపరేషన్ సిందూర్ సాధారణ సైనిక చర్య కాదు' అని ప్రధాని మోదీ అన్నారు.

భారత్ వైపు కన్నెత్తి చూస్తే..

భారత్ వైపు కన్నెత్తి చూడటం వల్ల ఒకే ఒక్క ఫలితం ఉంటుందని, విధ్వంసం జరుగుతుందని ఉగ్రవాద నేతలకు అర్థమైందన్నారు. ‘‘అమాయకుల రక్తం చిందిస్తే ఒకే ఒక్క ఫలితం ఉంటుంది... వినాశనం, మహా విధ్వంసం... పాక్ సైన్యం రక్షణలో ఉగ్రవాదులు కూర్చొని ఉన్నారు. భారత సైన్యం పాక్ సైన్యాన్ని మట్టి కరిపించింది’’ అని మోదీ అన్నారు. పొరుగు దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా భారత్ తగిన రీతిలో దీటుగా బదులిస్తుందని పాక్ కు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.