Gehlot, Pilot put up show of unity: ఒకే వేదికపై, పక్కపక్కన గహ్లోత్, పైలట్
Gehlot, Pilot put up show of unity: రాజస్తాన్ లో అసాధారణ దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ పార్టీలో బద్ధ శత్రువులుగా ఉన్న రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ లు మంగళవారం ఒకే వేదికపై పక్కపక్కన కనిపించారు.
Gehlot, Pilot put up show of unity: రాజస్తాన్ కాంగ్రెస్ లో గహ్లోత్, పైలట్ ల వైరం దేశమంతా తెలుసు. వారిని బుజ్జగించడం పార్టీ అధిష్టానానికి నిత్య కృత్యంగా మారింది. తాజాగా, మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోయేలా ఈ ఇద్దరు నేతలు జైపూర్ లో ఒకే వేదికపై పక్కపక్కన నిల్చుని మీడియాతో మాట్లాడారు.
Gehlot, Pilot put up show of unity: ‘జోడో’ యాత్ర ప్రభావం
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ యాత్ర డిసెంబర్ 4వ తేదీన రాజస్తాన్ లో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా రాజస్తాన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఎం అశోక్ గహ్లోత్, అసంతృప్త నేత సచిన్ పైలట్ ఒకే వేదికపై కనిపించారు. పక్క పక్కనే నిల్చుని, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను రాజస్తాన్ లో విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు పార్టీ అధిష్టానం పలు ప్రయత్నాలు చేసింది. అధిష్టానం ఆదేశాలతోనే ప్రస్తుతానికి, అంటే భారత్ జోడో యాత్ర రాజస్తాన్ లో కొనసాగుతున్నంత కాలం, ఈ ఇద్దరు వైరి నేతలు ఒక్కటిగా కనిపించే అవకాశాలున్నాయని రాజస్తాన్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Gehlot, Pilot put up show of unity: పైలట్ ద్రోహి
ఇటీవల ఒక న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అశోక్ గహ్లోత్ అసమ్మతి నేత సచిన్ పైలట్ పై పరుష పదాలతో విరుచుకుపడ్డారు. పైలట్ ను ద్రోహి(గద్దార్) అంటూ మండిపడ్డారు. మరోవైపు, రాష్ట్రంలో అశోక్ గహ్లోత్ ను గద్దె దించడమే లక్ష్యంగా సచిన్ పైలట్ పని చేస్తున్నారు. ఒకానొక సమయంలో, సచిన్ పైలట్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు, రాష్ట్రంలో ఈ ఇద్దరు కీలక నేతల్లో ఎవరినీ కోల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. అందులో భాగంగానే, ఇటీవల, ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆస్తులని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.