French Spiderman news : 60ఏళ్ల ఓ వృద్ధుడు అద్భుతం చేశాడు! 'ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్'గా గుర్తింపు పొందిన ఆయన.. ఏకంగా 48 అంతస్తులను ఎక్కేశాడు. 60వ జన్మదినం సందర్భంగా ఈ గోల్‌ని కూడా ఛేదించేశాడు.
అలైన్ రాబర్ట్ అనే వ్యక్తికి ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్‌గా పేరు ఉంది. అచ్చం స్పైడర్‌మ్యాన్ తరహాలో ఎన్నో ఎత్తైన భవనాలను ఆయన సులభంగా ఎక్కేశాడు. ఈ శనివారం నాడు ఆయన 60వ పుట్టిన రోజు జరిగింది. ఈ క్రమంలో పారిస్‌లోని 613 అడుగుల ఎత్తు ఉన్న భవనాన్ని ఎక్కేశాడు. 60 నిమిషాల్లోనే 48 అంతస్తులను ఎక్కేయడం విశేషం!
"60ఏళ్లు వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు అన్న సందేహాన్ని ఇవ్వడం కోసమే ఇలా చేశాను. యాక్టివ్‌గా ఉండండి, 60ఏళ్ల వయస్సులో కూడా ఎన్నో పనులు చేయవచ్చు. నాకు 60ఏళ్లు వచ్చినప్పుడు.. ఈ భవనం ఎక్కుతానని ఎన్నో ఏళ్ల ముందే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అదే చేశాను," అని అలైన్ రాబర్ట్ చెప్పుకొచ్చాడు.
French Spiderman Alain Robert : తాజాగా.. ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ అలైన్ రాబర్ట్ ఎక్కిన భవనం పేరు టూర్ టోటల్ఎనర్జీస్ టావర్ అని తెలుస్తోంది. గతంలో ఎన్నోసార్లు ఆయన ఆ భవనాన్ని స్పైడర్‌మ్యాన్‌గా ఎక్కేశారు.
ఎలాంటి పరికరాల సాయం లేకుండా అలైన్ రాబర్ట్ ఎత్తైన భవనాలను ఎక్కేస్తుండటం చర్చలకు దారితీసింది. కొన్ని సందర్భాల్లో ఆయన పర్మీషన్లు కూడా తీసుకోకుండా ఎక్కేస్తుంటారు. ఫలితంగా పలు దేశాల్లో ఈ ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన భుర్జ్ ఖలీఫా సహా ఎన్నో వాటిని ఈ ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ అలైన్ రాబర్ట్ సులభంగా ఎక్కేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతూ ఉంటాయి.
సంబంధిత కథనం