ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియ ఇన్ఫ్లుయెంజర్లు.. ‘కంటెంట్’ పేరుతో చిత్ర, విచిత్ర పనులు చేస్తున్నారు. వీటిల్లో కొన్ని వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి. ఫ్రాన్స్‌లో ఇలాంటి ఒక ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. కంటెంట్ పేరుతో ఓ ఇన్ఫ్లుయెంజర్.. ప్రజలను సూదులతో పొడిచి, వారిని భయపెట్టాడు. చివరికి అక్కడి కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది!
ఫ్రాన్స్‌లో నివాసముండే సదరు ఇన్ఫ్లుయెంజర్ పేరు ఇలాన్ ఎం. అతనికి అమీనీ మొజిటో అని ఇంటర్నెట్లో గుర్తింపు ఉంది. కాగా ఇటీవలే అతను ప్రజల మీద ఒక ప్రాంక్ ప్లే చేశాడు. పారిస్ వీధుల్లో మాస్కు వేసుకుని తిరుగుతూ, కనిపించిన వారి శరీరాల్లో సూదులు పొడిచి, ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నట్టు ప్రవర్తించాడు.
వాస్తవానికి ఆ సూదులు ఖాళీవి. వాటిల్లో ఎలాంటి ధ్రవాలు లేవు. కానీ ఆ విషయం తెలియని ప్రజలు భయపడిపోయారు. చాలా మంది పారిపోయారు. ఇంకొంతమంది అమీని మొజిటోను వెంబడించారు. ఈ ప్రాంక్ కంటెంట్‌ని తీసుకెళ్లి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత సదరు ఇన్ఫ్లుయెంజర్కి చిక్కులు ఎదురయ్యాయి. ఆ ప్రాంక్ భయంకరంగా ఉందటూ కేసు పడింది. పారిస్‌లోని క్రిమినల్ కోర్టు ఆ 27ఏళ్ల ఇన్ఫ్లుయెంజర్కి 12నెలల జైలు శిక్ష విధించింది. అందులో 6 నెలలు కచ్చితంగా జైలులో ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, 1500యూరోల జరిమానాను విధిస్తూ.. 3ఏళ్ల పాటు సొంతంగా ఆయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసింది.
ఈ తీర్పు అక్టోబర్ 3న వెలువడగా, తాజాగా ఈ పూర్తి వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వ్యవహారంపై సదరు ఇన్ఫ్లుయెంజర్ స్పందించాడు.
“”చాలా సిగ్గుగా ఉంది. నా ప్రాంక్ సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేస్తుందని నాకు తెలియదు. స్పెయిన్, పొర్చుగల్లో ఇలాంటి ప్రాంక్‌లు చేశారు. నేను ఇంటర్నెట్లో చూసి ఇక్కడ ఫాలో అయ్యాను. కానీ ఇది ప్రజలను బాధపెడుతుందని అనుకోలేదు. ఇది నా తప్పే! ఇతరుల గురించి ఆలోచించలేదు. నా గురించే ఆలోచించుకున్నా," అని అతను చెప్పినట్టు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
ఈ పూర్తి వ్యవహారంపై నెటిజన్లు సైతం స్పందించారు.
“దేనికైనా ఒక హద్దు ఉంటుంది,” అని ఒకరు, “అది నిజంగా భయంకరంగా ఉంది,” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం