Toxic gas: లోతైన బావిలో విషవాయువులు పీల్చి నలుగురు మృతి
లోతైన బావిలోకి దిగి, అక్కడి విష వాయువులు పీల్చి నలుగురు మృత్యువాత పడ్డారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు అత్యవసర ప్రతిస్పందన దళం, ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని బావి నుంచి నాలుగు మృతదేహాలను బయటకు తీశారు.
మధ్యప్రదేశ్ లోని కట్నీలో బావి లో దిగి, అక్కడి విషవాయువు పీల్చి నలుగురు మృతి చెందారు. బావిలో నుంచి మృత దేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

విష వాయువులు పీల్చి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్నీ జిల్లాలోని జుహ్లీ గ్రామంలోని ఒక లోతైన బావిలో నుంచి నీటిని తోడేందుకు బావిలోపల ఒక మోటారును ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బావిలోని నీటి మట్టం పెరగి, ఆ మోటారు నీటిలో మునిగిపోయింది. దాంతో, గురువారం మధ్యాహ్నం పింటూ కుష్వాహా అనే వ్యక్తి పంప్ ను బయటకు తీయడానికి బావిలోకి దిగి, అక్కడి విష వాయువులు పీల్చి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని కాపాడేందుకు రాజ్ కుమార్ దూబే, అతని మేనల్లుడు నిఖిల్ దూబే, రాజేష్ కుష్వాహా అనే ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగారు. కానీ వారు కూడా, విష వాయువుల ప్రభావంతో స్పృహతప్పి బావిలో పడిపోయారు.
గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో..
గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రాష్ట్ర విపత్తు అత్యవసర ప్రతిస్పందన దళం, ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బావిలో విషవాయువు పీల్చి వారు చనిపోయారని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. మరణానికి అసలు కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందం బావిలోని నీరు, వాయువుల నమూనాలను సేకరించిందని పోలీసు అధికారి దూబే తెలిపారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.