అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎముకకు వ్యాపించిన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిర్ధారణ అయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
గ్లీసన్ స్కోరును ఉపయోగించి ప్రోస్టేట్ క్యాన్సర్ అంచనా వేస్తారు. ఇది 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది. ఆరోగ్యకరమైన వాటితో పోలిస్తే క్యాన్సర్ కణాలు ఎంత అసాధారణమైనవో సూచిస్తుంది.
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, బైడెన్‌కి గ్లీసన్ స్కోరు 9 వచ్చింది. అంటే వ్యాధి అత్యంత తీవ్ర రూపాన్ని సూచిస్తుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా మెటాస్టాసిస్ అయినప్పుడు ఎముకలకు వ్యాపిస్తుంది. వ్యాధి ప్రోస్టేట్ దాటి వ్యాపించిన తర్వాత, చికిత్స చేయడం గణనీయంగా కష్టమవుతుంది. ఎందుకంటే మందులు అన్ని కణితులను లక్ష్యంగా చేసుకోవడం, తొలగించడం కష్టం.
"ఇది వ్యాధి మరింత దూకుడు రూపాన్ని సూచిస్తున్నప్పటికీ, క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది. ఇది సమర్థవంతమైన నిర్వహణకు అనుమతిస్తుంది," అని ఆయన కార్యాలయం తెలిపింది.
82 ఏళ్ల బైడెన్ తన అధ్యక్ష పదవిలో ఉన్న సమయం నుంచే ఆయన ఆరోగ్యం పట్ల సర్వత్రా చర్చలు జరిగాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లకు చాలా కాలంగా ఆందోళన కలిగించింది. తిరిగి ఎన్నిక కావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జూన్ డిబేట్లో పేలవమైన ప్రదర్శన తరువాత ఆయన రేసు నుంచి తప్పుకున్నారు. అప్పటి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు.
అధ్యక్ష పదవీకాలంలో జో బైడెన్ పలు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. 2023 ఫిబ్రవరిలో వైద్యులు ఆయన ఛాతీ నుంచి సాధారణ చర్మ క్యాన్సర్ అయిన బేసల్ సెల్ కార్సినోమాను తొలగించారు.
25 ఏళ్లలో క్యాన్సర్ మరణాల రేటును సగానికి తగ్గించాలనే లక్ష్యంతో 2022లో 'క్యాన్సర్ మూన్‌షాట్' కార్యక్రమాన్ని ప్రారంభించారు బైడెన్. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తన పెద్ద కుమారుడు బ్యూను కోల్పోయిన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఆయన చేసిన కృషితో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
జో బైడెన్‌కి క్యాన్సర్ సోకిందన్న విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
'జో బైడెన్ తాజా వైద్య నిర్ధారణ గురించి విని నేను, మెలానియా చాలా బాధపడ్డాము. జిల్ సహా కుటుంబానికి మేము మా హృదయపూర్వక విషెస్ తెలియజేస్తున్నాము. జో త్వరగా, విజయవంతంగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము," అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు.
సంబంధిత కథనం