Dr. Manmohan Singh's last rites: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని నేడు న్యూఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ఉదయం జరగనున్నాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఆయన నివాసంలో ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు.
డిసెంబర్ 28, శనివారం ఉదయం 8 గంటలకు ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి కాంగ్రెస్ నాయకులు, మిత్రులు, సన్నిహితులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు నివాళులు అర్పిస్తారు. రేపు ఉదయం 8.30 నుంచి గంటపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. శనివారం ఉదయం 9.30 గంటల తరువాత AICC ప్రధాన కార్యాలయం నుండి శ్మశాన వాటికకు డాక్టర్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆయనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అత్యవసర విభాగంలో రాత్రి 8.01 గంటలకు చేర్చారు. ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి 9.56 గంటలకు తుది శ్వాస విడిచారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్తను ఎయిమ్స్ అధికారికంగా ధ్రువీకరించింది. గత కొంత కాలంగా మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. పలు మార్లు ఎయిమ్స్ లో చికిత్స పొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వయస్సు 92 సంవత్సరాలు.