Dr Manmohan Singh: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత
Dr Manmohan Singh: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, ఆయనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చారు. మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ రాత్రి 9.56 గంటలకు తుది శ్వాస విడిచారు.
Dr Manmohan Singh: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆయనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అత్యవసర విభాగంలో రాత్రి 8.01 గంటలకు చేర్చారు. ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి 9.56 గంటలకు తుది శ్వాస విడిచారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్తను ఎయిమ్స్ అధికారికంగా ధ్రువీకరించింది. గత కొంత కాలంగా మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. పలు మార్లు ఎయిమ్స్ లో చికిత్స పొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వయస్సు 92 సంవత్సరాలు.
ఆసుపత్రికి ప్రముఖులు
మన్మోహన్ మరణ వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఎయిమ్స్ కు వెళ్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ సీనియర నాయకులంతా ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కర్నాటకలోని బెళగావిలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థత సమాచారం తెలియగానే వారు హుటాహుటిన ఢిల్లీ బయల్దేరారు.
పదేళ్లు ప్రధానిగా..
డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారధ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. 33 ఏళ్ల రాజకీయ అనుభవం తర్వాత రాజ్యసభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ముగించారు. 1991 జూన్ లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ భారత దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారు. దివాళా అంచున చేరిన దేశాన్ని మళ్లీ, ప్రధాని పీవీ నరసింహరావు నాయకత్వంలో ఒక గాటిన పెట్టి, అభివృద్ధి మార్గం పట్టించారు.
రాజ్యసభలో..
ఆ తరువాత నాలుగు నెలలకు 1991లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎగువ సభలో ఐదుసార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన ఆయన 2019లో రాజస్థాన్ కు మారారు. పెద్దనోట్ల రద్దును 'వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ'గా అభివర్ణిస్తూ ఆయన చివరిసారిగా పార్లమెంటులో ప్రసంగించారు. నిరుద్యోగం అధికంగా ఉందని, అసంఘటిత రంగం అతలాకుతలమైందని, 2016లో తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన సంక్షోభం అని ఆయన విమర్శించారు.