ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బిచ్చగాడిని చంపి.. మృతదేహం దగ్గర ఐడీని వదిలేసిన వ్యక్తి
Insurance Money : డబ్బు సంపాదన కోసం కొంతమంది చేసే పనులు దారుణంగా ఉంటాయి. ఓ వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బిచ్చగాడిని చంపేశాడు. ఆ తర్వాత తన ఐడీని మృతదేహం దగ్గర పెట్టాడు.
బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి.. యాచకుడిని హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బిచ్చగాడిని ట్రక్కుతో తొక్కించి చంపాడు. యాచకుడికి బదులుగా తాను చనిపోయినట్టుగా ప్రపంచానికి తెలియాలని గుర్తింపు కార్డును మృతదేహం పక్కనే పెట్టాడు. ఈ ఘటన బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇన్సూరెన్స్ మోసానికి సంబంధించిన ఈ షాకింగ్ కేసు రాజస్థాన్ బన్స్వారా జిల్లాలో జరిగింది. ప్రధాన నిందితుడు నరేంద్ర సింగ్ రావత్ పరారీలో ఉండగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సల్లోపట్ ప్రాంతంలో 56వ జాతీయ రహదారి వెంబడి డిసెంబర్ 1న గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తర్వాత ఈ నేరం వెలుగులోకి వచ్చింది. మృతదేహం దగ్గర దొరికిన పత్రాల ద్వారా మొదట చనిపోయిన వ్యక్తి నరేంద్ర సింగ్ రావత్‌గా అధికారులు అనుకున్నారు. వివరాల ఆధారంగా నరేంద్ర సింగ్ రావత్ కుటుంబం దగ్గరకు వెళ్లారు. అయితే రావత్ కుటుంబీకులు మృతదేహాన్ని గుర్తించలేదు. చనిపోయింది నరేంద్ర సింగ్ రావత్ కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తులో మృతి చెందిన వ్యక్తి బిచ్చగాడు తోఫాన్ బైర్వాగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసును విచారణ చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రావత్ భారీగా అప్పులు చేసి, అనేక బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. చనిపోయినట్టుగా నటించి.. బీమా సొమ్మును క్లెయిమ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం చిత్తోర్‌గఢ్‌కు చెందిన మరో బిచ్చగాడు భేరులాల్, ట్రక్ డ్రైవర్ ఇబ్రహీమ్‌లతో కలిసి ప్లాన్ వేశాడు. వారికి రూ.85,000, రూ.65,000 ఇచ్చాడు.
ముగ్గురు కలిసి తోఫాన్ బైర్వా అనే యాచకుడిని చంపేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా గుజరాత్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని బైర్వాకు ఎర వేశారు. హత్యకు ప్లాన్ చేస్తూ రోజుల తరబడి అతడికి మద్యం తాగించారు. నవంబర్ 30న అతన్ని సల్లోపట్‌లోని రహదారి మీదకు తీసుకెళ్లారు. అప్పటికే బాగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న బైర్వాపై నుంచి సిమెంటుతో నిండిన ట్రక్కును నడిపించారు.
పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో భేరులాల్, ఇబ్రహీం కుట్రను ఒప్పుకున్నారు. ఈ ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ప్రధాన నిందితుడు రావత్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.