'ద్రౌపది ముర్ము'ను రాష్ట్రపతి చేసింది ఇందుకేనా!.. బీజేపీ స్కెచ్ మామూలుగా లేదుగా!
2024 Odisha election : 2024లో జరగనున్న ఒడిశా ఎన్నికల కోసం బీజేపీ.. ‘ముర్ము’ అస్త్రాన్ని ప్రయోగించింది! ఆ రాష్ట్రంలోని మహిళలు, గిరిజన ఓట్లను సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
2024 Odisha election : 2024లో ఒడిశా ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేసింది! ఇందులో భాగంగానే ఒడిశాపై 'ద్రౌపది ముర్ము' అస్త్రాన్ని ప్రయోగించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అస్త్రం ఫలిస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ మెరుగ్గా రాణించేందుకు అవకాశాలుంటాయి!
గిరిజనుల ఓట్ల కోసం..!
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఇటీవలే రాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించారు. అనంతరం భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అయితే.. ఒడిశాలోని గిరిజన ప్రాంతానికి చెందిన ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసేందుకు ఓ కారణం ఉన్నట్టు కనిపిస్తోంది. అదే గిరిజనుల ఓట్లు..!
ఒడిశాలో గిరిజనుల జనాభా 23శాతం. 12 అసెంబ్లీ స్థానాలు.. 55శాతం కన్నా ఎక్కువ గిరిజనుల జనాభా కలిగి ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 17శాతం మాత్రమే నగరాల్లో ఉంటోంది. మిగిలిన 83శాతం జనాభా.. గ్రామాల్లో నివాసముంటోంది.
ఒడిశాలో మొత్తం మీద 147 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 24 సీట్లు గిరిజనులకు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేడీ.. ఆ 24 సీట్లల్లో 20 స్థానాలు దక్కించుకుంది. ఆ 20మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఇక ఇప్పుడు.. మహిళలు, గిరిజనులపై దృష్టిసారిస్తే.. రాష్ట్రంపై పట్టుసాధించడం సులభమవుతుందని బీజేపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రంలోని 3.26కోట్ల జనాభాలో.. మహిళలే దాదాపు 1.54కోట్లు ఉంటారు!
మహిళలను ఆకర్షించి, వారి ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు.. బీజేపీ తన 'హామీల'పై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, భద్రత, న్యాయం వంటి అంశాలను పరిశీలిస్తోందని సమాచారం.
BJP Odisha : అయితే.. బీజేపీకి ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేడీయే. లోక్‌సభ, స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే పార్టీ టికెట్లను 33శాతం మహిళలకే కేటాయించింది.
కానీ గత కొన్నేళ్లుగా ఒడిశాలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోంది. సీఎం నవీన్ పట్నాయక్‌కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఆయన్ని కమలదళం ఇబ్బంది పెడుతోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకుంది బీజేపీ. 21లోక్‌సభ స్థానాల్లో 8 సీట్లను సంపాదించుకుంది. 14.5శాతం ఓట్లను పెంచుకుంది. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటింది.
ఇక లోక్‌సభ ఎన్నికలు సైతం 2024లోనే జరగనున్నాయి. 'ముర్ము' ఫ్యాక్టర్.. బీజేపీకి ఎంతమేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం