Fixed Deposit | ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి మీకు ఇవి తెలుసా?-fixed deposit advantages terms and conditions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fixed Deposit Advantages Terms And Conditions

Fixed Deposit | ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి మీకు ఇవి తెలుసా?

Praveen Kumar Lenkala HT Telugu
Feb 17, 2022 10:27 AM IST

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను టర్మ్ డిపాజిట్ అని కూడా అంటారు. నిర్ధిష్ట కాలానికి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌పై వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌పై కాస్త వడ్డీ రేటును ఎక్కువగా ఆఫర్ చేస్తాయి. తక్కువలో తక్కువగా ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసుకోవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ భద్రత గల పొదుపు సాధనం
ఫిక్స్‌డ్ డిపాజిట్ భద్రత గల పొదుపు సాధనం (unsplash)

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చాలా భద్రమైన పొదుపు సాధనం. రూ. లక్ష వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ ఇండియా ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది. బ్యాంకులే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌లను ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఆఫర్ చేస్తాయి. బ్యాంకింగ్ రంగంలోని షెడ్యూలు బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు.. ఇలా అన్ని రకాల బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

అయితే అన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఒక్కరీతిలో ఉండవు. ఒక్కో బ్యాంకు ఒక్కో రీతిలో వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతి, లాభాపేక్ష వంటి అంశాల ఆధారంగా అవి వడ్డీ రేట్లను నిర్ణయించుకుంటాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ పై వడ్డీ ఎప్పుడు పొందవచ్చు?

సాంప్రదాయ స్కీముల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌పై వడ్డీని మనకు నచ్చిన రీతిలో.. అంటే నెలవారీగా లేదా మూడు నెలలకోసారి పొదుపు ఖాతాలో జమయ్యేలా ఆప్షన్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. అయితే రీఇన్వెస్ట్‌మెంట్ స్కీముల్లో ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ మొత్తం.. అసలు సొమ్ములో కలిసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అందిస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌పై రుణం పొందవచ్చా?

ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌పై రుణం పొందవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పైగా తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌పై 90 శాతం రుణాన్ని ఆఫర్ చేస్తున్నాయి.

మెచ్యూరిటీ కంటే ముందే తీసుకోవచ్చా?

ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌ను నిర్ధిష్ట సమయం కంటే ముందే తీసుకోవచ్చు. ఒరిజినల్‌గా మీరు ఐదారేళ్లకు ఫిక్స్ చేసుకున్నప్పటికీ ఆ తేదీ రాకముందు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అయితే ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్స్ విషయంలో బ్యాంకులు కొంత పెనాల్టీ విధిస్తాయి. అంటే వడ్డీ రేటులో కొంత కోత విధిస్తాయి. ప్రీమెచ్యూర్ ఉపసంహరణకు సంబంధించి వడ్డీ రేటు ఎలా ఉంటుందో కూడా బ్యాంకులో ముందే తెలుసుకోవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌కు ఆటో రెన్యువల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎఫ్‌డీ ఖాతా తెరిచేటప్పుడు గానీ, మెచ్యూరిటీకి ముందు గానీ ఆటో రెన్యువల్ ఆఫ్షన్ ఎంచుకోవచ్చు. అంటే మీరు ఒరిజినల్‌గా ఎంత కాలానికి ఫిక్స్‌డ్ చేశారో, తిరిగి అంతేకాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అమల్లోకి వస్తుంది.

టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కూడా ఉంది. అయితే ఈ తరహా ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు నిర్ధిష్ట కాలవ్యవధితో లాకిన్ పీరియడ్ కలిగి ఉంటుంది. సెక్షన్ 80 సీ కింద దీనికి పన్ను రాయితీ పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ డెట్ ఇన్వెస్ట్‌మెంట్ పరిధిలోకి వస్తుంది. మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోలిస్తే చాలా తక్కువ రాబడిని ఇస్తుంది. అయితే ఎలాంటి రిస్కూ ఉండదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం