Patanjali product : మళ్లీ చిక్కుల్లో రాందేవ్ బాబా! ఆ పతంజలి ‘వెజిటేరియన్’ ప్రాడక్ట్‌లో..
గ్రీన్ డాట్ పెట్టి వెజిటేరియన్‌గా ప్రచారం చేస్తున్న ఓ పతంజలి ప్రాడెక్ట్లో సముద్రఫెన్ అనే చేపలకు సంబంధించిన మూలాలు ఉన్నట్టు దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ మేరకు కేంద్రం, పతంజలికి నోటీసులు జారీ చేసింది.
యోగా గురు రాందేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ తన "దివ్య దంత్ మంజన్" దంత సంరక్షణ ఉత్పత్తిని తప్పుగా బ్రాండింగ్ చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఐ), కంపెనీకి స్పందించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తప్పుదోవ పట్టించే యాడ్స్‌ని సృష్టించారన్న ఆరోపణలతో రాందేవ్ బాబా కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొన్న తరుణంలో తాజాగా మరొకటి బయటపడటం సర్వత్రా చర్చకు దారితీసింది.
పతంజలి ప్రాడక్ట్ "దివ్య దంత్ మంజన్" గ్రీన్ డాట్ (వెజిటేరియన్ ఉత్పత్తిని సూచించే) మార్కెట్ చేసినప్పటికీ, సముద్రఫెన్ అనే చేపలకు సంబంధించిన మూలాల వాడినట్టు పిటిషనర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం ఇది తప్పుడు బ్రాండింగ్ కిందకు వస్తుందని శర్మ పేర్కొన్నారు. వాస్తవానికి ఔషధాలకు శాఖాహారం లేదా మాంసాహారం అని నిర్దిష్ట లేబుల్ వేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రీన్ డాట్‌ని ఉపయోగించడం డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం "తప్పుడు బ్రాండింగ్" కిందకు వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
శర్మ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ నరులా కేంద్రం, ఎఫ్ఎస్ఎస్ఏఐతో పాటు పతంజలి, దివ్య ఫార్మసీ, యోగా గురు రాందేవ్ తదితర సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాదులు స్వప్నిల్ చౌదరి, ప్రశాంత్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. “మత విశ్వాసాల కారణంగా కఠినమైన వెజిటేరియన్ డైట్‌ని అనుసరించే తనకు, తన కుటుంబానికి ఇది చాలా బాధాకరం,” అని అన్నారు.
రెస్పాండెంట్ నెం.3 (పతంజలి ఆయుర్వేద) తమ అధికారిక వెబ్సైట్లో గ్రీన్ డాట్‌తో ఉత్పత్తిని విక్రయిస్తోందని, ఇది శాకాహారి అని సూచిస్తుందని, లోపల ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చూస్తే ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది.
మాంసాహారాన్ని అనుకోకుండా వినియోగించడం వల్ల కలిగే తీవ్ర ఇబ్బందులను పరిష్కరించాలని పిటిషనర్ కోరారని, మత విశ్వాసాలను నిలబెట్టడం, ఉత్పత్తి ప్రాతినిధ్యంలో పారదర్శకతను నిర్ధారించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని న్యాయవాదులు మోహిత్ సోలంకి, పుల్కిత్ చౌదరి ద్వారా దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ విషయంపై తదుపరి విచారణ నవంబర్‌లో జరగనుంది.
రాందేవ్ బాబాపై కోర్టు ధిక్కరణ చర్యలు..
ఇటీవలి కాలంలో పతంజలి ఎదుర్కొంటున్న వరుస సవాళ్లలో ఇది కొత్తది.
పతంజలి, సీఈఓ బాలకృష్ణ, రాందేవ్లపై కోర్టు ధిక్కరణ చర్యలను ఆగస్టు 13న సుప్రీంకోర్టు మూసివేసింది. పతంజలి తన ఉత్పత్తుల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని వచ్చిన ఆరోపణలతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.
నవంబర్ 2023 లో, సుప్రీంకోర్టు పతంజలికి కఠినమైన హెచ్చరికను జారీ చేసింది. చట్టపరమైన ప్రమాణాలను పాటించాలని, దాని ఉత్పత్తుల ఔషధ ప్రయోజనాల గురించి తప్పుదోవ పట్టించే వాదనలను ఆపాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ, పతంజలి మొదట్లో ఈ హామీలను పాటించడంలో విఫలమైందని, ఇది కోర్టు ధిక్కార చర్యలకు దారితీసిందని కోర్టు గుర్తించింది. పతంజలి ఉత్పత్తుల సమర్థత, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
చివరికి పతంజలి, దాని ప్రతినిధులు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో కోర్టు ధిక్కరణ కేసును మూసివేసి, భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించింది.
సంబంధిత కథనం
టాపిక్