CMs resigned before floor test బలపరీక్షకు ముందు రాజీనామా చేసిన సీఎంలు వీరే..
అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా చేసిన ముఖ్యమంత్రుల జాబితాలో తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా చేరారు. గతంలో ఇలా ముందే రాజీనామా చేసిన సీఎంలలో.. త్వరలో మరోసారి మహారాష్ట్ర సీఎం కానున్న దేవేంద్ర ఫడణవీస్ కూడా ఉండడం విశేషం.
CMs resigned before the floor test: అసమ్మతి నేతల తిరుగుబాటుతో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన ముఖ్యమంత్రుల ఉదంతాలు భారత రాజకీయ చరిత్రలో చాలా ఉన్నాయి. వాటిలో తాజా చేరిక ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా. సైద్ధాంతిక వైరుద్ధ్యం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీల అసాధారణ మద్దతుతో దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. తాజాగా, సొంత పార్టీలో ప్రజ్వరిల్లిన అసమ్మతితో బుధవారం ఆ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బలపరీక్షకు మందే రాజీనామాలు చేసిన ముఖ్యమంత్రుల వివరాలు..

కమల్‌నాథ్
కరోనా కల్లోలం భారత్‌లో ప్రారంభం కావడానికి కొద్దిగా ముందు, మార్చ్ నెలలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన విశ్వసనీయ ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వంలో, పార్టీలో సంక్షోభం ఏర్పడింది. సింధియా మార్చ్ 11 బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బలపరీక్ష తప్పదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో, అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ బలపరీక్ష ఎదుర్కోకుండానే సీఎం పదవికి రాజీనామా చేశారు.
దేవేంద్ర ఫడణవీస్
బీజేపీ తరఫున త్వరలో మరోసారి మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టబోతున్న దేవేంద్ర ఫడణవీస్, గతంలో ఇదే అసెంబ్లీ విశ్వాసం కోల్పోయి రాజీనామా చేశారు. 2019 నవంబర్ 23న అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తిరుగుబాటు వర్గం మద్దతుతో ఫడణవీస్ మహారాష్ట్ర సీఎంగా పదవి చేపట్టారు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, 3 రోజుల్లోనే శరద్ పవార్ మంత్రాంగంతో అజిత్ పవార్ యూ టర్న్ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. దాంతో, తప్పని పరిస్థితుల్లో, బలపరీక్షకు హాజరుకాకుండానే, నవంబర్ 26న ఫడణవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంగా కేవలం 80 గంటలు ఉన్న నేతగా ఫడణవీస్ ఎవరూ ఆశించని రికార్డు సృష్టించారు.
యెడియూరప్ప
బీజేపీ నేత యెడియూరప్ప కర్నాటక ముఖ్యమంత్రిగా 2017 మే 17న ప్రమాణం చేశారు. కానీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సాధించడంలో విఫలమై, బలపరీక్షకు ముందే అదే నెల 19న రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలిచి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ, ఆ తరువాత కాంగ్రెస్, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకుని విజయవంతంగా బీజేపీని అధికారానికి దూరం చేశాయి.
నబమ్ టుకీ
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ నేత నబమ్ టుకీ 2016 జులై 13న ప్రమాణం చేశారు. జులై 16న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా గవర్నర్ తథాగథరాయ్ ఆదేశించారు. అయితే, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొందలేకపోయిన టుకీ.. బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు.
జితన్ రామ్ మాంఝీ
2014 సాధారణ ఎన్నికల్లో బిహార్‌లో జేడీయూ ఓటమి అనంతరం సీఎం పదవికి జేడీయూ నేత నితిశ్ కుమార్ రాజీనామా చేశారు. తదుపరి సీఎంగా జితన్ రామ్ మాంఝీని ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎంగా ఉండాలని, ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మళ్లీ నితీశ్ సీఎంగా పగ్గాలు చేపడ్తారని ముందేమాంఝీకి స్పష్టం చేశారు. అయితే, మాంఝీ నితిశ్‌పై తిరుగుబాటు చేశారు. దాంతో, మాంఝీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. మెజారిటీని నిరూపించుకోవాలని బిహార్ గవర్నర్ మాంఝీని ఆదేశించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో, 2015 ఫిబ్రవరి 20న బలపరీక్షకు ముందే మాంఝీ రాజీనామా చేశారు.