ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ పై అంతస్తులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి, అతని ఇద్దరు పిల్లలు భవనం పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందారు.
ఉదయం 10 గంటల సమయంలో ఎంఆర్వీ స్కూల్ సమీపంలోని సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ పై అంతస్తు మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఆ అపార్ట్మెంట్లోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. వారిలో ఒక వ్యక్తి, ఇద్దరు కుమారులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ భవనం పై నుంచి దూకారు. కానీ, తమ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. వారి వయస్సు, ఇతర వివరాలు వెంటనే అందుబాటులో లేవు. అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా వెంటనే తెలియరాలేదు.
ఉదయం 10:01 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించి సమాచారం అందిందని, ఆ తర్వాత ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం లోపల ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు చిక్కుకుని ఉంటారని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని, పోలీసులు, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్ సంఘటనా స్థలంలో ఉన్నాయని వారు తెలిపారు. ప్రస్తుతానికి అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. తదుపరి సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం