Bombay High Court: ‘భార్య తప్పుడు కేసులు పెట్టి వేధించడం క్రూరత్వమే; ఆ భర్తకు విడాకులు మంజూరు చేయొచ్చు’: బాంబే హైకోర్టు
Bombay High Court భర్తపై భార్య చేసే తప్పుడు ఫిర్యాదులు వైవాహిక జీవితంలో క్రూరత్వం కిందకు వస్తాయని, ఆ ప్రాతిపదికన ఆ భర్తకు విడాకులు మంజూరు చేయవచ్చని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. తప్పుడు కేసులు పరస్పర విశ్వాసం, గౌరవాన్ని దెబ్బతీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది.
False cases by wife: భర్త, అత్తమామలపై, అతడి కుటుంబ సభ్యులపై భార్య తప్పుడు ఫిర్యాదులు చేయడం వైవాహిక సంబంధాల్లో క్రూరత్వం కిందకు వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాతిపదకన ఆ భర్తకు విడాకులు మంజూరు చేయవచ్చని తీర్పునిచ్చింది.
కింది కోర్టు తీర్పునకు సమర్ధన
భర్త, అతని కుటుంబ సభ్యులపై భార్య తప్పుడు కేసు పెట్టిందని, ఇది వారిని మానసిక వేదనకు గురి చేసిందని, ఇది భార్య క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు ఆ భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసింది. ఆ తీర్పుపై ఆ భార్య బాంబే హైకోర్టుకు అప్పీల్ చేశారు. విచారణ అనంతరం, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ అద్వైత్ సేథ్నాల డివిజన్ బెంచ్ నిరాకరించింది.
వైవాహిక బంధం విశ్వాసానికి విఘాతం
ఆ భార్య తన భర్తపై చేసే తప్పుడు ఆరోపణల వల్ల వారి వైవాహక బంధం విశ్వాసానికి విఘాతం కలుగుతుందని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది. తప్పుడు కేసులతో మానసిక వేదన కలిగించడం క్రూరత్వం కిందకే వస్తుందని, ఆ ప్రాతిపదికన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 (1) (ఐ-ఎ) ప్రకారం వారికి విడాకులు (divorce) మంజూరు చేయవచ్చని పేర్కొంది.
భార్య తప్పుడు ఆరోపణలపై బాంబే హైకోర్టు తీర్పు
ఆరోగ్యకరమైన వైవాహిక బంధంలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ భార్య తన భర్తపై పలుమార్లు ఫిర్యాదు చేసిన కేసులో కోర్టు ఆమె పిటిషన్ ను కొట్టివేసింది. తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, గౌరవం పునాది దెబ్బతింటుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తాను ఎనిమిదేళ్లుగా సహజీవనం చేసిన మాజీ భర్తతో దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ 36 ఏళ్ల విడాకులు తీసుకున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారించింది. 2012లో తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందని, తనపై, తన కుటుంబ సభ్యులపై పలు తప్పుడు కేసులు పెట్టి తమను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.