Economics graduate sells tea | ఆమె ఓ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. ఎంతో కష్టపడి చదువుకుంది. కానీ ఉద్యోగం దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం దక్కలేదు. పోటీ పరీక్షలు సైతం రాసింది. కానీ అనుకున్నది జరగలేదు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. సొంతంగా వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంది. టీ స్టాల్ పెట్టింది. ఇది.. బిహార్‌కు చెందిన ప్రియాంక కథ!
బిహార్ పూర్ణియాకు చెందిన ప్రియాంక గుప్తా.. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్‌లో ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యింది. కానీ ఉద్యోగాలు దొరకలేదు. ఫలితంగా పట్నా ఉమెన్స్ కాలేజీ ఎదురుగా.. ఓ టీ స్టాల్ పెట్టింది. దానికి 'ఛాయ్‌వాలీ' అనే పేరు పెట్టింది. 'ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కరణల్లో ఇదొకటి. ఎక్కువగా ఆలోచించకండి. పని మొదలుపెట్టేయండి,' అంటూ ఆ టీ స్టాల్‌కు ఓ బోర్డు కూడా తగిలించింది.
ఇతర టీ దుకాణాల కన్నా తన స్టాల్ ప్రత్యేకంగా ఉండాలని భావించింది ప్రియాంక. ఈ క్రమంలోనే పాన్ టీ, చాక్లెట్ టీ అంటూ నాలుగు కొత్త రకాల టీలను పరిచయం చేసింది.
"2019లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. రెండేళ్లుగా ఉద్యోగం గురించి తీవ్రంగా ప్రయత్నించాను. బ్యాంకు పరీక్షలు కూడా రాశాను. కానీ ఫలితం దక్కలేదు. ఇంటికి వెళ్లిపోవడమే నాకు దిక్కు అనిపించింది. కానీ వెళ్లలేదు. దాని బదులు పట్నాలో.. ఓ తోపుడు బండి మీద టీ స్టాల్ పెట్టాను. నాకు వేరే ఆలోచనలు లేవు. నేనేమీ సిగ్గుపడటం లేదు. ఇదొక వ్యాపారంలాగా భావిస్తున్నాను, ఆత్మనిర్భర్ భారత్‌లో ఇది ఓ భాగం. చాలా మంది ఛాయ్‌వాలాలు ఉన్నారు. కానీ ఛాయ్వాలీలు ఎందుకు లేరు? అని అనిపించింది. వెంటనే వ్యాపారం మొదలుపెట్టేశాను," అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
టీ అమ్ముతున్న ప్రియాంక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వెంటనే వైరల్‌గా మారిపోయాయి. ఆమె ఆత్మస్థైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకం అని కామెంట్లు పెడుతున్నారు.
అదే సమయంలో దేశంలో నిరుద్యోగ సమస్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. "దేశంలో ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రజలకు సరైన తిండి దొరకడం లేదు. కానీ మనం మాత్రం.. హిందు- ముస్లిం పేర్లతో కొట్టుకుంటున్నాము. అల్లర్లు, ఘర్షణలే పత్రికల్లో హెడ్‌లైన్స్‌లో ఉంటున్నాయి. మరో 50ఏళ్లల్లో మనం ఆఫ్రికాలాగా మారాలా? లేక అమెరికాను అందుకోవాలా? ఇది ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రజలపైనే ఇది ఆధారపడి ఉంటుంది," అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.
'దేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు.. మోదీజీ ఈ విధంగా యువతను ప్రోత్సహిస్తున్నారు,' అంటూ మరో వ్యక్తి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
సంబంధిత కథనం