Fadnavis Vs Shinde: ఏక్ నాథ్ షిండేకు షాక్ ఇచ్చిన ఫడణవీస్; మహారాష్ట్రలో రసవత్తరంగా రాజకీయాలు
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు, మాజీ బాస్ శరద్ పవార్ తో అజిత్ పవార్ మళ్లీ చేతులు కలపబోతున్నారన్న వార్తలు వస్తుండగా, మరోవైపు, ఫడణవీస్, షిండేల మధ్య విబేధాలు ప్రారంభమైనట్లుగా కథనాలు వస్తున్నాయి.
Maharashtra Politics: మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న శివసేన (షిండే) వర్గం నేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ కు బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏక్ నాథ్ షిండే తీసుకున్న నిర్ణయంపై విచారణకు ఆదేశించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) కోసం బస్సులను అద్దెకు తీసుకోవాలని గత ఏడాది సెప్టెంబర్ లో అప్పటి సీఎంగా షిండే తీసుకున్న నిర్ణయంపై ఫడ్నవీస్ సోమవారం స్టే విధించారు. గత మహాయుతి ప్రభుత్వంలో రవాణా శాఖను కూడా షిండే నే నిర్వహించారు.
బాస్ నేనే అని స్పష్టీకరణ
తాజా నిర్ణయంతో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బాస్ తనేనని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర (maharashtra news) కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తనదే సంపూర్ణ అధికారమని చాటుకున్నారు. కొత్త మహాయుతి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం ఫడ్నవీస్ ప్రతి శాఖ పనితీరును సమీక్షిస్తున్నారు. తన ప్రభుత్వ మొదటి 100 రోజుల పాలన కోసం వారి ప్రణాళికలపై చర్చిస్తున్నారు. సోమవారం రవాణా శాఖపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం షిండే తీసుకున్న నిర్ణయంపై స్టే విధించారు.
ధరల్లో తేడా..
ఇంధన వ్యయాన్ని మినహాయించి కిలోమీటరుకు రూ.34.70 నుంచి రూ.35.10 చొప్పున 1,310 బస్సులను అద్దెకు తీసుకునేందుకు షిండే (eknath shinde) సీఎంగా ఉన్న సమయంలో ఎంఎస్ఆర్టీసీ మూడు ప్రైవేటు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) ఇచ్చిందని రవాణా శాఖ అధికారులు ఫడ్నవీస్ కు వివరించారు. కిలోమీటర్ కు రూ.22 చొప్పున ఇంధన ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో బస్సుకు కిలోమీటరు వ్యయం రూ.56 నుంచి రూ.57 వరకు ఉంటుందని అధికారులు ఫడ్నవీస్ (fadnavis) కు చెప్పారు. 2022లో ఎంఎస్ఆర్టీసీ, ఇంధన ఖర్చులను కలుపుకుని కిలోమీటర్ కు రూ.44 చొప్పున బస్సులను అద్దెకు తీసుకున్న విషయాన్ని ఫడ్నవీస్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది ఇప్పటి ఒప్పందం కంటే కిలోమీటరుకు రూ .12 నుండి రూ .13 తక్కువని గుర్తు చేశారు. దాంతో, 1,310 బస్సులను అద్దెకు తీసుకోవాలన్ని ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఫడణవీస్ నిలిపివేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
షిండే హయాంలోనే..
షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రవాణా శాఖకు నేతృత్వం వహించినప్పుడు 2024 సెప్టెంబరులో అద్దె బస్సులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. షిండేకు అత్యంత సన్నిహితుడైన భరత్ గోగవాలే 2024 సెప్టెంబరులో ఎంఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. అనంతరం, డిసెంబరులో ఎంఎస్ఆర్టీసీ మూడు ప్రైవేట్ కంపెనీలకు ఎల్వోఐలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ తాజా నిర్ణయంతో కొత్త మహాయుతి ప్రభుత్వంలో ఎలాంటి విబేధాలు ఉత్పన్నమవుతాయో అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఫడ్నవీస్ తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఇది నాటి రవాణా మంత్రిగా ఉన్న షిండేకు, అతని సన్నిహితుడు భరత్ గోగవాలేకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
విపక్షాల విమర్శలతో..
రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వే అద్దె బస్సు పథకాలకు ప్రైవేటు సంస్థలు కోట్ చేసిన రేట్లను ప్రస్తావించారు. రేటు చాలా ఎక్కువగా ఉందన్న ఆరోపణలను షిండే తోసిపుచ్చారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు. ముంబై-పుణెకు 450 బస్సులు, నాసిక్-ఛత్రపతి శంభాజీ నగర్ కు 430 బస్సులు, నాగ్పూర్-అమరావతికి 430 బస్సులు కలిపి మొత్తం 1,310 బస్సులకు టెండర్లను ఆహ్వానించారు. దీని ప్రకారం సిటీ లైఫ్ లైన్ ట్రావెల్స్, ట్రావెల్ టైమ్ మొబిలిటీ ఇండియా, ఆంటోనీ రోడ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ బిడ్లు దాఖలు చేశాయి.