‘ఎఫ్​16, జేఎఫ్​17.. ఆపరేషన్​ సిందూర్​ దెబ్బకు కూలిన పాక్​ యుద్ధ విమానాలు’-f 16 jf 17 among 5 pak jets downed during op sindoor iaf chief counters sharif ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘ఎఫ్​16, జేఎఫ్​17.. ఆపరేషన్​ సిందూర్​ దెబ్బకు కూలిన పాక్​ యుద్ధ విమానాలు’

‘ఎఫ్​16, జేఎఫ్​17.. ఆపరేషన్​ సిందూర్​ దెబ్బకు కూలిన పాక్​ యుద్ధ విమానాలు’

Sharath Chitturi HT Telugu

ఆపరేషన్ సిందూర్‌లో 5 పాక్ యుద్ధ విమానాలను కూల్చేశామని భారత వైమానిక దళం మరోసారి స్పష్టం చేసింది. తాము కూల్చిన వాటిలో ఎఫ్​16 వంటి యుద్ధ విమానాలు ఉన్నట్టు వివరించింది. ఈ మేరకు పాక్ ప్రధాని తప్పుడు ప్రచారానికి దీటైన జవాబు ఇచ్చింది.

ఐఏఎఫ్​ చీఫ్​ ఏపీ సింగ్​ (PTI)

ఆపరేషన్​ సిందూర్​పై భారత వైమానిక దళం (ఐఏఎఫ్​) మరోసారి కీలక ప్రకటన చేసింది. మే నెలలో నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా తాము పాకిస్థాన్​కి చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశ సైనిక చర్య గురించి వక్రీకరించిన వాస్తవాలను ప్రస్తావించిన కొద్ది రోజులకే భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

93వ వైమానిక దళ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ, ఎఫ్​16, జేఎఫ్​17 రకానికి చెందిన ఐదు పాకిస్థాన్​ యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసిందని తెలిపారు.

పాక్ వైమానిక స్థావరాలపై భారీ దెబ్బ..

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా, భారతదేశం పాకిస్థాన్​లోని అనేక ఎయిర్‌ఫీల్డ్‌లు, స్థావరాలపై దాడులు చేసిందని, ఇది ఆ దేశానికి చెందిన రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, హాంగర్లు, రన్‌వేలకు భారీ నష్టాన్ని కలిగించిందని వైమానిక దళాధిపతి వెల్లడించారు.

"ఒక సీ130 రకానికి చెందిన విమానంతో పాటు కనీసం 4 నుంచి 5 యుద్ధ విమానాల (ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్) కూల్చివేతకు సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో మరమ్మతులో ఉన్న వాటిని బట్టి, అవి ఎక్కువగా ఎఫ్​6 విమానాలే అయ్యి ఉండొచ్చు," అని ఆయన పేర్కొన్నారు.

"300 కిలోమీటర్లకు పైబడిన లాంగ్-రేంజ్ స్ట్రైక్‌కు సంబంధించి మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అది AEW&C లేదా SIGINT విమానం అయ్యి ఉండవచ్చు. దానితో పాటు ఎఫ్​16, జేఎఫ్​17 రకానికి చెందిన ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చేశామని మా వ్యవస్థలు స్పష్టంగా చెబుతున్నాయి," అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వివరించారు.

'మనోహర్ కహానియా' అంటూ పాక్‌పై ఎగతాళి..

భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్​ చేస్తున్న తప్పుడు ప్రకటనలను ఆయన ఎగతాళి చేస్తూ, వాటిని "మనోహర్ కహానియా" (మనోహరమైన కథలు) అని అభివర్ణించారు!

"వారు మాకు చెందిన 15 యుద్ధ విమానాలను కూల్చివేశామని అంటున్నారు. దాని గురించి వారు గట్టిగా నమ్ముతారని ఆశిస్తున్నాను. వారు మళ్లీ యుద్ధానికి వచ్చినప్పుడు, నా ఇన్వెంటరీలో 15 విమానాలు తక్కువగా ఉన్నాయని లెక్కించుకోవచ్చు" అంటూ వైమానిక దళాధిపతి చమత్కరించారు.

కాగా ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాకిస్థాన్​ యుద్ధ విమానాలను కూల్చినట్లు వైమానిక దళం ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. గత ఆగస్టులో కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ, ఎస్​400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఆ విమానాలను కూల్చివేసినట్లు తెలిపారు.

పాక్ ప్రధాని వక్రీకరణ: ఐరాసలో భారత్ దీటుగా బదులు..

పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రసంగంలో పాక్ బలగాలు ఏడు భారతీయ జెట్‌లను కూల్చివేశాయని తప్పుగా పేర్కొన్నారు. "మా డేగలు ఎగరాయి, వారి జవాబును ఆకాశంలో లిఖించాయి. ఫలితంగా ఏడు భారతీయ జెట్‌లు తుక్కుగా, ధూళిగా మారిపోయాయి," అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్‌ను గురించి కూడా ఆయన వక్రీకరించి మాట్లాడారు. పహల్గామ్ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోసం తాను చేసిన నిజాయితీపూర్వకమైన ప్రతిపాదనను భారత్ తిరస్కరించి, మా పౌరులపై దాడి చేసిందని ఆయన ఆరోపించారు.

దీనికి మరుసటి రోజు భారత్ తరఫున ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గహ్లోట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హాంగర్లు విజయాలుగా కనిపిస్తే, పాకిస్థాన్​ ప్రధాని ఆ విజయాన్ని ఆస్వాదించవచ్చు. వారికి స్వాగతం," అని గహ్లోట్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలిగొన్న ఘోరమైన ఉగ్రదాడి జరిగిన పదిహేను రోజుల తర్వాత, మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాకిస్థాన్​లో, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.