న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 11, 2023న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఈ పిటిషన్‌లో సీబీఐ సవాలు చేసింది. ఈ పిటిషన్‌లో ఇప్పటికే విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇరుపక్షాల నుంచి రాతపూర్వక వాదనలు సమర్పించినందున కేసును జనవరి 11న విచారిస్తామని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ధర్మాసనం పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి ఈడీ కేసులో వీరి బెయిల్ పిటిషన్ విచారణ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, జనవరి 12, జనవరి 13న విచారణకు రానుంది.
అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరంలో నిందితులుగా ఉన్న ప్రతివాదికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా, దర్యాప్తు చాలా కీలకమైన దశలో ఈ నిర్ణయం తీసుకున్నారని సీబీఐ పిటిషన్ పేర్కొంది.
బెయిల్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సూచించిన నియమాలు పాటించలేదని సీబీఐ నివేదించింది. నిందితులు విచారణకు దొరకకుండా ఈ కేసులో చాలా కుట్రపూరితంగా వ్యవహరించారని నివేదించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శి నుంచే సీబీఐ ఏజెన్సీకి గత ఏడాది జూలై 22న లేఖ వచ్చిందని నివేదించింది.
దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని, ఈ వ్యవహారంలో కుట్ర కోణం వెలికి తీశామని, నిందితుడు ప్రయివేటు లిక్కర్ హోల్‌సెల్లర్స్‌కు ప్రయోజనం చేకూరేలా ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయించేందుకు వారి నుంచి డబ్బులు వసూలు చేశాడని నివేదించింది. ఈ దశలో బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తు తీవ్రంగా ప్రభావితమవుతుందని సీబీఐ విన్నవించింది.
నవంబరు 14, 2022న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కమ్యూనికేషన్ ఇంఛార్జి విజయ్ నాయర్, హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయినపల్లికి రోజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఇదే కేసులో ఈడీ అభియోగాలపై వీరు ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు.
టాపిక్