పుతిన్ ప్రియురాలిపై ఈయూ ఆంక్షలు.. ఎవరీ పుతిన్ గర్ల్‌ఫ్రెండ్?
అలీనా కబాయెవా.. ఇప్పుడు ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఈ పేరు చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న ఈ అంతర్జాతీయ జిమ్నాస్ట్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలకు సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ఎవరీ అలీనా కబాయేవా? అని నెటిజన్లు ఆరాతీస్తున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యా, అనుకూల వ్యక్తులు, సంస్థలపై ఈయూ వరుసగా ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆంక్షలకు సంబంధించిన మరో జాబితాను ఈయూ సిద్ధం చేసింది. ఆ జాబితాలో అలీనా కబాయెవా పేరు కూడా ఉంది. ఈ జాబితాను ఈయూలోని 27 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, అలీనా కబాయెవాపై ఆంక్షలు విధిస్తే.. పుతిన్ కోపం మరింత పెరుగుతుందని, దానివల్ల రష్యా- ఈయూ సంబంధాలు మరింత దిగజారుతాయని ఈయూ సభ్య దేశాలు కొన్ని భావిస్తున్నాయి. దాంతో, మొదట్లో ఆ జాబితాలో అలీనా కబాయెవా పేరును చేర్చడంపై ఈయూ కొంత వెనుకడుగు వేసింది. ఈ ఆంక్షలు అమల్లోకి వస్తే అలీనా కబాయెవాకు ఈయూ దేశాల్లోకి ప్రవేశం ఉండదు. ఆయా దేశాల్లోని ఆమె ఆస్తులను ఫ్రీజ్ చేస్తారు.
మాజీ జిమ్నాస్ట్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శృంగార పురుషుడనే పేరు కూడా ఉంది. ఆయన ప్రియురాళ్ల జాబితా కూడా పెద్దదే. అందులో ప్రముఖమైన పేరు అలీనా కబాయెవా. ఈమె మాజీ జిమ్నాస్ట్. పుతిన్‌కు చాలా దగ్గర వ్యక్తి. రష్యా రాజకీయాల్లో కీలక నేత. 1983లో రష్యాలో ఈమె జన్మించారు. జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందారు. రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో గొప్ప ప్రతిభ చూపే అలీనా కబాయెవా ఖాతాలో రెండు ఒలంపిక్ పతకాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఏకంగా 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్ మెడల్స్, 21 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ మెడల్స్ ఉన్నాయి. 2014లో రష్యా నిర్వహించిన వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా ఆమెనే ముందు నిలిచారు.
2008 నుంచి అనుబంధం..
పుతిన్‌తో ఈమె అనుబంధం వార్తలు 2008లో వెలుగులోకి వచ్చాయి. రష్యాకు చెందిన ఒక చిన్న పత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పుతిన్ త్వరలో అలీనా కబాయెవాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ పత్రిక ప్రచురించిన వార్త సంచలనం సృష్టించింది. ఈ వార్తను పుతిన్ ఖండించారు. తన వ్యక్తిగత జీవితంపై వార్తలు ప్రచురించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. అయితే, వారిద్దరి సాన్నిహిత్యం గురించి వార్తలు రావడం మాత్రం ఆగలేదు. వారిద్దరికి పిల్లలు కూడా కలిగారని కొన్ని రష్యన్ పత్రికలు రాశాయి.
ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు వ్యాపారాలు..
రష్యాలో ప్రధానమైన నేషనల్ మీడియా గ్రూప్‌కు కబాయెవా చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ కు రష్యాలోని అన్ని ప్రధాన మీడియా సంస్థల్లో మెజారిటీ వాటాలున్నాయి. 2007 నుంచి 2014 వరకు అలీనా కబాయెవా అధికార యునైటెడ్ రష్యా పార్టీ తరఫున పార్లమెంట్ దిగువసభ మెంబర్‌గా ఉన్నారు. పుతిన్‌తో అనుబంధంతో కబాయెవా కుటుంబం కొద్ది కాలంలోనే కోట్లకు పడగలెత్తింది. ప్రస్తుతం అలీనా కబాయెవా స్విట్జర్లాండ్‌లో అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్