భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎదురుదెబ్బ! ఈఓఎస్- 09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో కూడిన పీఎస్ఎల్వీ- సీ61 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) లాంచ్ విఫలమైంది! ఫలితంగా ఈ మిషన్‌ని ఇస్రో రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 5:59 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈఓఎస్-09ను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 101వ ఉపగ్రహ ప్రయోగం. కాగా నింగిలోకి ఎగిరిన అనంతరం, 3వ దశ వచ్చేసరికి ప్రొపల్షన్ సిస్టెమ్లో లోపం కారణంగా రాకెట్ నియంత్రణ కోల్పోయిందని తెలుస్తోంది.
రాకెట్ నింగిలోకి ఎగిరిన 203వ సెకండ్లో హెచ్టీపీబీ (హైడ్రాక్సైల్ టెర్మినేటెడ్ పాలీబుటాడయీన్) ప్రొపలెంట్ సరిగ్గా పనిచేయలేదని సమాచారం. అందుకే రాకెట్ విఫలమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ పూర్తిస్థాయిలో విఫలం అవ్వడం (63 లాంచ్‌లలో) ఇది 3వసారి. 2017 నుంచి తొలిసారి.
“ఈఓఎస్-09తో కూడిన పీఎస్ఎల్వీ సీ61 ఈరోజు శ్రీహరికోట నుంచి 101వ లాంచ్‌కి ప్రయత్నించాము. మొత్తం 4 దశలు ఉంటాయి. 2వ దశ వరకు అంతా బాగానే జరిగింది. 3వ దశ పర్ఫెక్ట్గా ప్రారంభమైంది. కానీ సరిగ్గా పనిచేయలేదు. మిషన్‌ని పూర్తి చేయలేకపోయాము. పరిస్థితి విశ్లేషించి మళ్లీ ప్రయోగిస్తాము,” అని ఇస్రో ఛైర్మన్ అన్నారు.
ఫ్లైట్ డేటాను ఇంజినీర్లు విశ్లేషిస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నారు. పీఎస్3 స్టేజ్ పనితీరులో లోపాలపై దర్యాప్తు చేసేందుకు కమిటీ కూడా ఏర్పడింది.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) తన 63వ మిషన్‌లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-09)ను మోసుకెళ్లింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో భూమి ఉపరితలానికి సంబంధించిన హై-రిజల్యూషన్ చిత్రాలను తీయగలదు.
వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రతకు ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.
సుమారు 1,696.24 కిలోల బరువున్న ఈ ఇస్రో ఈఓఎస్-09 ఉపగ్రహం దేశంలోని విస్తృత భూభాగం అంతటా మెరుగైన రియల్ టైమ్ కవరేజీని అందించడానికి రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాల సమూహంలో భాగం అవ్వాల్సి ఉంది.
మిషన్ విఫలం అవ్వడంతో భారత దేశ సరిహద్దు నిఘా ప్రణాళికలు మరింత ఆలస్యం అవ్వనున్నాయి.
రిశాట్-1 ఉపగ్రహానికి కొనసాగింపుగా ఇస్రో ఈ ఈఓఎస్-09 (రిశాట్-1బీ) తీసుకొచ్చింది. రిసోర్స్ శాట్, కార్టోశాట్, రిశాట్-2బీ సిరీస్ ఉపగ్రహాల డేటాను ఇది భర్తీ చేయాల్సి ఉంది.
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-09 అనేది 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 పునరావృత ఉపగ్రహం. ఆపరేషనల్ అప్లికేషన్లలో నిమగ్నమైన యూజర్ కమ్యూనిటీకి రిమోట్ సెన్సింగ్ డేటాను నిర్ధారించడం, పరిశీలన ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడం అనే మిషన్ లక్ష్యంతో దీనిని రూపొందించింది ఇస్రో.
ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ నారాయణన్ శుక్రవారం తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నారాయణన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పీఎస్ఎల్వీ-సీ61 నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి మిషన్ విజయవంతం, భద్రత కోసం ఆశీస్సులు తీసుకున్నారు.
రిశాట్-1 ఉపగ్రహానికి ఈఓఎస్-09 అనుసరణ అని ఇస్రో మాజీ శాస్త్రవేత్త మనీష్ పురోహిత్ అన్నారు. ఈ ప్రయోగం వ్యూహాత్మకంగా సమయానుకూలంగా జరిగిందని చెప్పారు.
“సరిహద్దు, తీర ప్రాంతాలు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ ఈఓఎస్-09 మానిటరింగ్ చేస్తుంది. ఏ కదలికలైనా పసిగట్టేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఇది ఉపయోగపడుతుంది. పహల్గామ్ ఉగ్రవాది, ఆపరేష్ సిందూర్ తర్వాత ఈ తరహా శాటిలైట్ అవసరం ఉంది,” అని ఆయన అన్నారు.
సంబంధిత కథనం