Twitter layoffs: మళ్లీ వచ్చేయండి : మస్క్ యూటర్న్-elon musk twitter takes u turn on layoffs reports ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Elon Musk Twitter Takes U Turn On Layoffs Reports

Twitter layoffs: మళ్లీ వచ్చేయండి : మస్క్ యూటర్న్

HT Telugu Desk HT Telugu
Nov 07, 2022 10:00 AM IST

Twitter Layoffs: ఉద్వాసనకు గురైన కొందరు ఉద్యోగులకు ట్విట్టర్ మళ్లీ సందేశాలు పంపుతోందని తెలుస్తోంది. తిరిగి విధుల్లో చేరాలని కోరుతోందని సమాచారం.

ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో కొందరిని వెనక్కి పిలుస్తున్న ట్విటర్
ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో కొందరిని వెనక్కి పిలుస్తున్న ట్విటర్ (REUTERS)

Twitter layoffs: ప్రముఖ సోషల్ మీడియా నెట్‍వర్కింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ (Twitter)లో ప్రతీ రోజూ కొత్త పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్నప్పటి నుంచి పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఏకంగా కంపెనీలో పని చేస్తున్న సగం మంది ఉద్యోగులను తొలగించడం సంచలనంగా మారింది. మస్క్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వస్తున్నారు. వైరిఫైడ్ అకౌంట్‍లకు ఉండే బ్లూటిక్‍కు చార్జీల విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. అయితే ఉద్యోగుల తొలగింపు అంశంపై మస్క్ పునరాలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Elon Musk Twitter Employees: పొరపాటుగా..

ట్విట్టర్ నుంచి ఉద్వాసనకు గురైన పదుల మంది ఉద్యోగులకు.. మళ్లీ విధులకు రావాలని సంస్థ నుంచి ఈ-మెయిల్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ బ్లూమ్‍బర్గ్ వెల్లడించింది. ‘పొరపాటున తొలగించామని, మళ్లీ వచ్చేయాలని కొందరికి సందేశాలు వచ్చాయి. మస్క్ తీసుకొద్దామనుకుంటున్న కొన్ని ఫీచర్ల కోసం కొందరి పని, అనుభవం చాలా అవసరం. అది గుర్తించని మేనేజ్‍మెంట్ వారిని తొలగించింది’ అని ఈ విషయంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు.

మొత్తం 3,700 మంది ఉద్యోగులను ట్విట్టర్ ఒకేసారి తొలగించింది. కంపెనీ ఖర్చులను తగ్గించాలని మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫీస్‍లో ఉన్నా.. దారిలో ఉన్నా ఇంటికి వెళ్లిపోవాలంటూ తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ ఈ-మెయిల్స్ పంపింది. ఈ-మెయిల్స్, స్లాక్ వంటి కంపెనీ సర్వీస్‍లను యాక్సెస్ చేయలేకపోవడంతో తమ ఉద్యోగం పోయిందని చాలా మందికి తెలిసింది.

ఉద్యోగులను మళ్లీ తిరిగిరావాలని చెబుతుండటం.. ట్విట్టర్ లో ఈ ప్రక్రియ ఎంత గందరగోళంగా, అస్తవస్థంగా జరిగిందో తెలియజేస్తోందని బ్లూమ్‍బర్గ్ పేర్కొంది. తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని మళ్లీ నియమించుకునేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ప్లాట్‍ఫామర్ కూడా రిపోర్ట్ వెల్లడించింది.

Elon Musk Twitter Employees: ఎంత మందినో!

44 బిలియన్ డాలర్ల డీల్‍ను పూర్తి చేసుకొని ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న గంటల్లోనే ఎలాన్ మస్క్.. కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్‍తో పాటు మరో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‍లను తొలగించారు. ఆ తర్వాత ఏకంగా 3,700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరాలని పదుల సంఖ్యలో ఉద్యోగులకు సందేశాలు అందుతున్నాయని తెలుస్తోంది. మరి ఎంత మంది ఉద్యోగులను ట్విట్టర్ తిరిగి విధుల్లోకి తీసుకుంటుందో చూడాలి.

ట్విట్టర్ బ్లూటిక్ బ్యాడ్జ్ కోసం యూజర్లు నెలకు 8డాలర్లు చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్, బెనిఫిట్స్ విషయంలోనూ మార్పులు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ బ్లూను ఈనెలలోనే ఇండియాలో లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని మస్క్ చెప్పారు.

IPL_Entry_Point