Twitter revises verification: ట్విటర్ బ్లూబ్యాడ్జ్‌కు నెలకు 5 డాలర్ల ఫీజు?
Twitter revises verification: ట్విటర్ బ్లూబ్యాడ్జ్ ఉండాలంటే నెలకు 4.99 డాలర్లు చెల్లించాల్సి వచ్చేలా ఉంది.
సోషల్ మీడియా సంస్థ ట్విటర్ యూజర్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను రివైజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన రెండు రోజులకే సంస్థ అధినేత ఇలాన్ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌లో ఈ సంగతి వెల్లడించారు.
‘మొత్తం వెరిఫికేషన్ ప్రాసెస్ పునరుద్ధరిస్తున్నాం..’ అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంతకుమించి ఆయన వివరాలేవీ ప్రకటించలేదు.
ట్విటర్ తన యూజర్ల ధ్రువీకరణ బ్లూటిక్ మార్క్ కొనసాగించేందుకు వీలుగా కొంత రుసుము వసూలు చేయనున్నట్టు టెక్నాలజీ న్యూస్ లెటర్ ప్లాట్‌ఫార్మర్ ఆదివారం తెలిపింది. సంబంధిత పరిణామం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులను ప్రస్తావిస్తూ ఈ విషయం వెల్లడించింది.
యూజర్లు నెలకు 4.99 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ ప్రాజెక్టు మొదలయ్యాక వారి ‘వెరిఫైడ్’ బ్యాడ్జెస్ కోల్పోతారని ఆ నివేదిక తెలిపింది.
ఈ ప్రాజెక్టు గురించి ఇలాన్ మస్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రాజెక్టు ఇంకా ఆరంభ దశలోనే ఉంది. అయితే ప్లాట్‌ఫార్మర్ న్యూస్ లెటర్ నివేదిక ప్రకారం ట్విటర్ బ్లూ ప్రాజెక్టులో వెరిఫికేషన్ ఒక భాగంగా మారనుంది.
ట్విటర్ తన ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నెలకు 4.99 నుంచి 19.99 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని, అంతర్గత సమాచారాన్ని ఉటంకిస్తూ ఆదివారం వెర్జ్ నివేదించింది.
సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ట్విటర్ బ్లూ ప్రాజెక్టును గత ఏడాది జూన్‌లో ట్విటర్ లాంచ్ చేసింది. ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ప్రీమియం ఫీచర్స్ అందిస్తోంది. ముఖ్యంగా తమ ట్వీట్స్‌ను యూజర్లు ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఈ ఎడిట్ ఫీచర్ ఉండాలా వద్దా అంటూ ఇలాన్ మస్క్ గతంలో ఒక పోల్ నిర్వహించడంతో 70 శాతం మంది ఎడిట్ బటన్ ఉండాలని ఓటేశారు. దీంతో ఆ ఎడిట్ బటన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
లాగ్ అవుట్ అయిన ట్విటర్ యూజర్లు ట్రెండింగ్ ట్వీట్స్‌ను చూపే ట్విటర్ ఎక్స్‌ప్లోర్ పేజీకి రీడైరెక్ట్ అయ్యేలా చూడాలని కూడా మస్క్ కోరినట్టు వెర్జ్ ఆదివారం నివేదించింది. ఈ అంశం గురించి తెలిసిన ఉద్యోగులను ప్రస్తావిస్తూ ఈ సంగతి వివరించింది.