ట్రంప్ తో సయోధ్యకు మస్క్ ప్రయత్నాలు; ట్రంప్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ల తొలగింపు-elon musk expresses regret over last weeks posts on donald trump after feud ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ట్రంప్ తో సయోధ్యకు మస్క్ ప్రయత్నాలు; ట్రంప్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ల తొలగింపు

ట్రంప్ తో సయోధ్యకు మస్క్ ప్రయత్నాలు; ట్రంప్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ల తొలగింపు

Sudarshan V HT Telugu

డీఓజీఈ నుంచి వైదొలిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఎలాన్ మస్క్ సంబంధాలు క్షీణించాయి. ట్రంప్ పై మస్క్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యయ బిల్లును 'అసహ్యకరమైన బిల్లు అని అభివర్ణించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సయోధ్యకు టెస్లా సీఈవో మస్క్ ప్రయత్నాలు చేేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ తో సంబంధాలు దారుణంగా పతనమై, అవి తన వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, నష్ట నివారణ చర్యలను మస్క్ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గతవారం తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు. ‘‘గత వారం ప్రెసిడెంట్ @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్టులకు చింతిస్తున్నాను. అవి చాలా దూరం వెళ్లాయి’’ అని ఎలన్ మస్క్ తాజాగా ఒక ఎక్స్ పోస్ట్ లో రాశారు.

ట్రంప్ హెచ్చరికల ప్రభావం

అంతకుముందు, మస్క్ "తీవ్రమైన పరిణామాలు" ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ మద్దతు ఉన్న రిపబ్లికన్లకు వ్యతిరేకంగా పోటీ చేసే అభ్యర్థులకు మస్క్ మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అలా చేస్తే దాని పర్యవసానాలకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు.

మస్క్-ట్రంప్ బంధం ఎప్పుడు చెడిపోయింది?

ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను మస్క్ బహిరంగంగా విమర్శించడంతో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. భారీగా పన్ను కోతలను ప్రతిపాదించే ఈ బిల్లు అమెరికా జాతీయ రుణాన్ని సుమారు 3 ట్రిలియన్ డాలర్ల మేర పెంచుతుందని మస్క్ విమర్శించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి.

డీఓజీఈ నుంచి వెనక్కు

ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ లో సలహా బాధ్యతల నుంచి మస్క్ వైదొలగారు. ట్రంప్ ప్రతిపాదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును "అసహ్యకరమైన అసహ్యం" అని ఆయన విమర్శించారు. దీనిపై స్పందించిన ట్రంప్ మస్క్ కంపెనీలతో కుదుర్చుకున్న ప్రభుత్వ రాయితీలు, ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.

సొంత పార్టీ ప్రకటన

తన మద్దతు లేకుండా ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని గెలిచేవారు కాదని మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అభిశంసనకు పిలుపునివ్వడం సహా అధ్యక్షుడిని విమర్శించే పోస్టులను మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సొంతంగా రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్ లో ఒక పోల్ ను ప్రారంభించారు. మస్క్ తీరుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వీరి ఘర్షణలతో మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే, ట్రంప్ తో సయోధ్యకు మస్క్ ప్రయత్నాలు ప్రారంభించారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.