Crime news : ‘పబ్లిక్​లో ఎందుకు మూత్రం పోస్తున్నావు?’ అని అడిగినందుకు వృద్ధురాలిని చంపేశాడు!-elderly woman killed after confronting man over public urination ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ‘పబ్లిక్​లో ఎందుకు మూత్రం పోస్తున్నావు?’ అని అడిగినందుకు వృద్ధురాలిని చంపేశాడు!

Crime news : ‘పబ్లిక్​లో ఎందుకు మూత్రం పోస్తున్నావు?’ అని అడిగినందుకు వృద్ధురాలిని చంపేశాడు!

Sharath Chitturi HT Telugu

UP Crime news : ‘పబ్లిక్​లో ఎందుకు మూత్రం పోస్తున్నావు?’ అని అడిగినందుకు ఓ 62 వృద్ధురాలిని ఓ 22ఏళ్ల యువకుడు అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. యూపీలో జరిగింది ఈ సంఘటన.

యూపీలో దారుణం!

ఉత్తర్​ప్రదేశ్​ లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు?’ అని అడిగిన ఓ వృద్ధురాలిని, ఓ 22ఏళ్ల వ్యక్తి కిరాతకంగా కొట్టి చంపేశాడు.

ఇది జరిగింది..

మార్చ్​ 15న లక్నోలోని గోసాయిగంజ్​ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

"తుషాల్​ అలియాస్​ విశాల్​ వర్మ.. పబ్లిక్​లో మూత్రం పోశాడు. అదే సమయంలో 62ఏళ్ల జాగ్రానా అతడిని అడ్డుకుంది. బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు అని అడిగింది. వారిద్దరి మధ్య అది అప్పటికే రెండో సంఘటన. తుషాల్​​కి చాలా కోపం వచ్చింది. గోసాయిగంజ్​లోని ఒక పాడుబడిన ఇంట్లోకి వృద్ధురాలిని లాక్కెళ్లాడు. మెటల్​ రాడ్​తో ఆమె తల, ముఖాన్ని చాలాసార్లు కొట్టాడు. ఇటుకతో ఆమె తలపై దాడి చేశాడు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది," అని డీసీపీ సౌత్​ నిపుణ్​ అగర్వాల్​ తెలిపారు.

ఎల్​ఎల్​బీ స్టూడెంట్​ అయిన నిందితుడు మెటల్​ రాడ్​ని, ఇటుకను ఘటనాస్థలానికి దూరంగా పడేశాడు. పోలీసులకు అవి దొరకకుండా ఉంటే, తాను చేసిన నేరం నుంచి తప్పించుకోవచ్చని భావించాడు.

మరోవైపు, తన భార్య కనిపించడం లేదని జాగ్రానా భర్త జగ్​మోహన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటిరోజు ఆమె మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లో గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తొలుత వారికి ఆషారామ్​ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. హోలీ రోజున జగ్​మోహన్​కి ఆషారామ్​కి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలుసుకున్నారు. గొడవతోనే ఆషారామ్​.. జాగ్రానాను చంపేశాడా? అని అనుమానించారు. కానీ ఆషారామ్​ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది.

అసలు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ని పరిశీలించారు. వృద్ధురాలు అదృశ్యమైన రోజున ఓ దుకాణం దగ్గర ఆమె నిలబడ్డ దృశ్యాలు, ఆమెకు సమీపంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడి దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. ఆ యవకుడి గురించి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

యువకుడి పేరు తుషాల్​ అని గత కొన్ని రోజులుగా అతను ఇంటికి వెళ్లలేదని పోలీసులకు తెలిసింది. వెంటనే అతడిని పట్టుకునేందుకు కొన్ని టీమ్స్​ని ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​వేకి సమీపంలో శనివారం అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

విచారణలో భాగంగా తుషాల్​ నిజాన్ని ఒప్పుకున్నాడు. పబ్లిక్​లో మూత్రం పోస్తున్నందుకు ప్రశ్నించిందన్న కారణంతో వృద్ధురాలని చంపేసినట్టు పోలీసులకు వెల్లడించాడు.

ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. మూత్రవిసర్జనం ఎందుకు చేస్తున్నావు? అని అడిగినంతమాత్రానా చంపేస్తారా? అని పలువురు షాక్​ అవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.