Eknath Shinde : 'ఈడీ అంటే.. ఏక్నాథ్- దేవేంద్ర'
Eknath Shinde : మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. తాను ఎవరిని మోసం చేయలేదని, అన్యాయంపై పోరాటం చేశానని స్పష్టం చేశారు.
Eknath Shinde : తాను ఎవరిని మోసం చేయలేదని, కేవలం అన్యాయంపై పోరాటం చేశానని మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉద్ఘాటించారు. తాను శివసేన కార్యకర్తనేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. నన్ను సీఎం చేయాలని అనుకున్నారు. కానీ ఎన్సీపీ వ్యతిరేకించింది. పట్టు అంతా ఎన్సీపీ వద్దే ఉండేది అనిపించింది. సావర్కర్‌పై ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ను మేము వ్యతిరేకించలేకపోయాము. కూటమిలో కాంగ్రెస్ భాగం కదా. ఎన్సీపీ- కాంగ్రెస్‌తో ఏర్పడిన కూటమితో పార్టీ భవిష్యత్తుపై శివసేన శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. బీజేపీతో కలిసేందుకు గతంలో ఐదుసార్లు ప్రయత్నించాము. కానీ ఫలించ లేదు," అని ఏక్నాథ్ షిండే అన్నారు.
ఈ క్రమంలోనే మరణించిన ఇద్దరు కుమారులను తలచుకుని కంటతడి పెట్టుకున్నారు ఏక్నాథ్ షిండే.
"నా తండ్రి బ్రతికే ఉన్నారు. నా తల్లి మరణించింది. నా తల్లిదండ్రుల కోసం నేను సమయం కేటాయించలేకపోయాను. నేను పని నుంచి ఇంటికి వెళ్లేసరికి వారు పడుకుండిపోయేవారు. నా కుమారుల కోసం కూడా నేను సమయం కేటాయించలేదు. వాళ్లు ఇప్పుడు నా దగ్గర లేరు. ఎందుకు ఈ జీవితం అనిపించేది. నేను నా కుటుంబంతో ఉంటాను," అని మహారాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగ్గా.. 164ఓట్లతో విజయం సాధించారు ఏక్నాథ్ షిండే. 99మంది వ్యతిరేకించగా.. ముగ్గురు ఓటు వేయలేదు. 21మంది గర్హాజరయ్యారు.
'అవును ఇది ఈడీ ప్రభుత్వమే..'
Devendra Fadnavis : ఏక్నాథ్ షిండేకు ఓటు వేసిన రెబల్స్‌కు వ్యతిరేకంగా శివసేన సభ్యులు విరుచుకుపడ్డారు. 'ఈడీ'.. 'ఈడీ' అని అరిచారు. ఈడీకి భయపడే.. రెబల్స్.. బీజేపీకి మద్దతిచ్చారని ఆరోపించారు.
కొద్దిసేపటి అనంతరం.. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు.
"ఇది ఈడీ ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు. అవును ఇది ఈడీ ప్రభుత్వమే.. ఈడీ అంటే.. 'ఏక్నాథ్- దేవేంద్ర' ప్రభుత్వం," అని ఫడణవీస్ అన్నారు.
సంబంధిత కథనం