‘‘మీ ఈడీ అన్ని హద్దులు దాటుతోంది మిస్టర్ రాజు’’: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం; దర్యాప్తుపై స్టే-ed crossing all limits supreme court raps probe agency over tasmac raids ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘మీ ఈడీ అన్ని హద్దులు దాటుతోంది మిస్టర్ రాజు’’: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం; దర్యాప్తుపై స్టే

‘‘మీ ఈడీ అన్ని హద్దులు దాటుతోంది మిస్టర్ రాజు’’: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం; దర్యాప్తుపై స్టే

Sudarshan V HT Telugu

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ తన దర్యాప్తుల్లో అన్ని హద్దులను దాటుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లో అవకతవకలపై ఈడీ చేస్తున్న దర్యాప్తుపై స్టే విధించింది.

సుప్రీంకోర్టు (ANI)

తమిళనాడు ప్రభుత్వ మద్యం పంపిణీ విభాగమైన తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC)లో అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేస్తున్న దర్యాప్తుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఇటీవల కొన్ని కేసుల దర్యాప్తు సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అన్ని హద్దులు దాటుతోందని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈడీని మందలించింది.

టాస్మాక్ అవకతవకలు

మార్చి 6 నుంచి 8 వరకు చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ చేపట్టిన సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్ ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం, టాస్మాక్ దాఖలు చేసిన మూడు రిట్ పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాస్మాక్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్ పీ)పై సుప్రీం కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆగ్రహం

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 6 నుంచి 8 వరకు చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈడీ చర్యల చట్టబద్ధతను, ముఖ్యంగా కార్పొరేషన్ పై కేసు నమోదు చేయాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒక కార్పొరేషన్ పై ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించింది. ‘‘మీరు వ్యక్తులపై నమోదు చేయవచ్చు, కానీ కార్పొరేషన్కు వ్యతిరేకంగా ఎలా నమోదు చేస్తారు?’’ అని ఈడీ తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ధర్మాసనం ప్రశ్నించింది.

టాస్మాక్ అధికారులపై..

టాస్మాక్ కు చెందిన పలువురు ఉన్నతాధికారులపై ఈడీ ఇప్పటికే ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసిందని, అయితే ఈ కేసులో కీలకమైన నేర ఉద్దేశంపై మౌనంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. నేరానికి మూలాలు ఎక్కడున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసు అని, ఈడీ ఎలాంటి తప్పు చేయలేదని రాజు చెప్పడంతో ధర్మాసనం జోక్యం చేసుకుని ఈడీ ఇటీవల తన అధికారాలను అతిక్రమిస్తోందని వ్యాఖ్యానించింది.

ఈడీ అన్ని హద్దులు దాటుతోంది

‘‘ఈ విషయాన్ని మళ్లీ చెబుతున్నాం. మీ ఈడీ అన్ని హద్దులు దాటుతోంది మిస్టర్ రాజు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. టాస్మాక్, దాని ఉద్యోగుల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, సరైన ప్రక్రియ లేకుండా మొబైల్ ఫోన్లను క్లోనింగ్ చేయడం, వ్యక్తిగత పరికరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఏజెన్సీ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని వాదించారు.

దర్యాప్తుపై స్టే

ప్రైవసీ అంటూ ఒకటి ఉంటుందని రోహత్గీ వ్యాఖ్యానించారు. స్వాధీనం చేసుకున్న డివైస్ ల నుంచి సేకరించిన డేటాను ఉపయోగించకుండా చూడాలని సిబల్ కోర్టును కోరారు. వాదనల అనంతరం తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లో అవకతవకలపై ఈడీ చేస్తున్న దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టాస్మాక్ పై ఈడీ దాడులకు సంబందించిన కేసును మద్రాసు హైకోర్టు నుంచి బదిలీ చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు గత నెలలో తోసిపుచ్చింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.