ED arrests Tamil Nadu minister: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్ట్; ఛాతి నొప్పితో ఐసీయూలో మంత్రి బాలాజీ-ed arrests tamil nadu minister senthil balaji under anti money laundering act ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ed Arrests Tamil Nadu Minister: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్ట్; ఛాతి నొప్పితో ఐసీయూలో మంత్రి బాలాజీ

ED arrests Tamil Nadu minister: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్ట్; ఛాతి నొప్పితో ఐసీయూలో మంత్రి బాలాజీ

HT Telugu Desk HT Telugu
Jun 14, 2023 11:51 AM IST

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డీఎంకే నేత బాలాజీ సెంథిల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్ట్ చేసింది. బాలాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసింది.

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (ANI)

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డీఎంకే నేత బాలాజీ సెంథిల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రాత్రి అరెస్ట్ చేసింది. అన్నాడీఎంకే హయాంలో బాలాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసింది.

అన్నాడీఎంకేలో ఉండగా..

గతంలో బాలాజీ అన్నాడీఎంకేలో ఉండేవారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో 2011 - 2015 మధ్య బాలాజీ రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో చోటు చేసుకున్న అవినీతికి సంబంధించిన కేసులో బాలాజీ ప్రస్తుతం అరెస్టయ్యారు. బాలాజీ ఇల్లు, కార్యాలయాలపై మంగళవారం ఈడీ అధికారులు దాడులు చేశారు. అనంతరం, బాలాజీని సుదీర్ఘంగా ప్రశ్నించారు. రవాణా శాఖలో ఉద్యోగాలు ఇప్పించడానికి బాలాజీ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడని ఈడీ ఆరోపిస్తోంది.

అరెస్ట్ అనంతరం అస్వస్థత

బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన తరువాత ఆయన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో, ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈడీ అధికారులు బాలాజీని టార్చర్ చేశారని, అందువల్లనే ఆయన తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారని సహచర మంత్రి శేఖర్ బాబు ఆరోపించారు. మంత్రి బాలాజీ స్పృహలో లేరని, ఆయన చెవి కింది భాగంలో వాపు ఉందని, ఈడీ అధికారులు ఆయనను టార్చర్ చేశారని శేఖర్ బాబు వివరించారు. బాలాజీ బాధతో ఆర్తనాదాలు చేస్తున్న విజువల్స్ స్థానిక మీడియాలో వైరల్ గా మారాయి.

విపక్ష నేతల సపోర్ట్

తమిళనాడులో అధికార డీఎంకే మంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా విపక్ష నేతలు స్పందించారు. ఇది కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. డీఎంకే నేతకు అండగా ఉంటామన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి విపక్షాలను భయపెట్టాలని కేంద్రం భావిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తమిళనాడు మంత్రిని ఈడీ అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ కూడా ఖండించింది.